Sourav Ganguly: వైస్ కెప్టెన్ గా అజింక్యా రహానే... ఆశ్చర్యం వ్యక్తం చేసిన గంగూలీ
- దాదాపు ఒకటిన్నర ఏడాదిగా జట్టుకు దూరంగా ఉన్న రహానే
- ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్ లలో రాణించిన వైనం
- డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఎంపిక చేసిన సెలెక్టర్లు
- విండీస్ తో టెస్టు సిరీస్ కు ఏకంగా వైస్ కెప్టెన్సీ అప్పగించిన వైనం
- బీసీసీఐ నిర్ణయంపై విమర్శలు
భారత జట్టు జులై 12 నుంచి వెస్టిండీస్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన టీమిండియా జట్టుకు అజింక్యా రహానేను వైస్ కెప్టెన్ గా నియమించడం క్రికెట్ పండితులను ఆశ్చర్యానికి గురిచేసింది.
భవిష్యత్తు కెప్టెన్ కాగల ఆటగాళ్లను వైస్ కెప్టెన్ గా నియమించాలి కానీ, నిన్న మొన్నటి దాకా జట్టులో స్థానమే లేని రహానేను వైస్ కెప్టెన్ గా నియమించడం ఏంటని బీసీసీఐ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. కెరీర్ చరమాంకంలో ఉన్న రహానే తప్ప ఈ పదవికి మరో ఆటగాడు కనిపించలేదా? అని బాహాటంగానే బోర్డు నిర్ణయంపై మాజీలు ప్రశ్నిస్తున్నారు.
ఈ అంశంపై మాజీ సారథి సౌరవ్ గంగూలీ కూడా స్పందించాడు. బీసీసీఐ నిర్ణయం తనను విస్మయానికి గురిచేసిందని, శుభ్ మాన్ గిల్ వంటి యువ ఆటగాడిని వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసి ఉంటే, భవిష్యత్ దృష్ట్యా ఎంతో ప్రయోజనకరంగా ఉండేదని గంగూలీ పేర్కొన్నాడు. రహానేను వైస్ కెప్టెన్ చేయడం ద్వారా బీసీసీఐ ఏ ప్రయోజనం సాధించాలనుకుందో అర్థం కావడంలేదని అన్నాడు.
వైస్ కెప్టెన్ బాధ్యతల కోసం ఫామ్ లో ఉన్న శుభ్ మాన్ గిల్ ను సిద్ధం చేయడమే సరైన నిర్ణయం అని, ఒకవేళ గిల్ కాకపోతే రవీంద్ర జడేజాకైనా వైస్ కెప్టెన్సీ ఇచ్చి ఉండాల్సిందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.