Kota Chandrababu: సబ్ జైలు నుంచి విడుదలైన జనసేన నేత కోటా చంద్రబాబు
- చిందేపల్లి రోడ్డు సమస్యపై ఆందోళన చేయడంతో కేసు
- శ్రీకాళహస్తి సబ్ జైల్లో 14 రోజులు రిమాండ్ లో ఉన్న కోటా చంద్రబాబు
- జైలు వద్దకు భారీగా తరలివచ్చిన జనసైనికులు
జనసేన నేత కోటా చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యారు. ఏర్పేడు మండలంలో చిందేపల్లి రోడ్డు సమస్యపై ఆందోళన చేసిన కేసులో ఆయన శ్రీకాళహస్తి సబ్ జైల్లో 14 రోజుల రిమాండ్ ను అనుభవించారు. మరోవైపు ఈ రోజు జైలు నుంచి ఆయన విడుదలవుతున్న సందర్భంగా జనసేన రాష్ట్ర నేతలు పసుపులేటి హరిప్రసాద్, శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి కోటా వినుత, పలువురు జనసేన నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
అయితే 30 పోలీసు యాక్టు అమల్లో ఉందని చెపుతూ జైలు వద్దకు భారీగా తరలివచ్చిన జనసైనికులను పోలీసులు అక్కడి నుంచి వెళ్లగొట్టారు. జైలు వద్ద నుంచి చేపట్టిన బైక్ ర్యాలీని అడ్డుకున్నారు. ఈ క్రమంలో జనసేన శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఓ దశలో జనసైనికులపై పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేశారు. మరోవైపు జైలు నుంచి ఓపెన్ టాప్ వాహనంలో వెళ్లిన చంద్రబాబు, వినుతలను పోలీసులు అడ్డుకున్నారు. చివరకు కోటా దంపతులు తమ నివాసానికి చేరుకున్నారు.