infosys: వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కావాలనే డిమాండ్ వారిది!: ఇన్ఫోసిస్ సీఈవో ఆసక్తికర వ్యాఖ్యలు
- ఉద్యోగులు ఎక్కడి నుండి పని చేయాలనే విషయంలో కంపెనీ వెసులుబాటు
- తమ ప్రాజెక్టులను ఆఫీస్ నుండి నిర్వహించాలని కొంతమంది క్లయింట్స్ డిమాండ్
- ఇన్ఫోసిస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో షేర్ హోల్డర్ అడిగిన ప్రశ్నకు సీఈవో
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కు చెందిన కొంతమంది క్లయింట్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుండి పని చేయాలని కోరుతున్నారట. ఉద్యోగులు ఎక్కడి నుండి పని చేయాలనే విషయంలో కంపెనీ వెసులుబాటు కల్పించినప్పటికీ, తమ ప్రాజెక్టులను ఆఫీస్ నుండి నిర్వహించాలని పలువురు క్లయింట్స్ డిమాండ్ చేశారని చెబుతున్నారు. ఈ మేరకు ఇన్ఫోసిస్ సీఈవో ఆసక్తికర అంశాన్ని తెలిపారు. ఉద్యోగులు ఇంటి నుండి లేదా కార్యాలయం నుండి పనిచేసేలా వారికి అనువైన అవకాశాన్ని కంపెనీ ఇస్తోందని, కానీ తమ క్లయింట్లలో కొంతమంది వారి ప్రాజెక్టులను ఆఫీస్ నుండి నిర్వహించేలా డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.
ఇన్ఫోసిస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో షేర్ హోల్డర్ అడిగిన ప్రశ్నకు సీఈవో సలీల్ పరేఖ్ స్పందిస్తూ... భవిష్యత్తులో మరింత సామాజిక మూలధనం అవసరమని, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, శిక్షణ మొదలైన వాటి కోసం ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాము ఉద్యోగులకు అనువైన విధానాన్ని అమలు చేస్తున్నామని, ఉద్యోగులు ఇంటి నుండి లేదా హైబ్రిడ్ మోడల్ విధానంలో పని చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. క్లయింట్స్ కు అవసరమైనప్పుడు తమకు క్యాంపస్ లో పని చేసే ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. దీర్ఘకాలిక ప్రాతిపదికన సామాజిక అనుసంధానం, బృందంగా పని చేయాల్సిన చోట ఆ మేరకు పని చేసే ఉద్యోగులు ఉంటారన్నారు.
సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాయ్ మాట్లాడుతూ, ఉద్యోగులు కొన్నిరోజుల పాటు కార్యాలయానికి వచ్చి పనిచేసేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఇది సామాజిక మూలధనాన్ని పెంచుతుందని నమ్ముతున్నామని, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నది క్లయింట్ అవసరాలపై ఆధారపడి ఉంటుందన్నారు. క్లయింట్స్ పట్టుబడితే ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి పని చేయవలసి ఉంటుందన్నారు.