Mallu Bhatti Vikramarka: బీఆర్ఎస్‌లోకి వెళ్లాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: మల్లు భట్టి

mallu bhatti comments on MLA paler mla

  • పోలీసులు రాజకీయాలకు అతీతంగా పని చేయాన భట్టి
  • కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయని హెచ్చరిక 
  • రోడ్ల మధ్యలో స్తంభాలు, రంగులు వేస్తే అభివృద్ధి కాదని ఆగ్రహం

పోలీసులు రాజకీయాలకు అతీతంగా పని చేయాలని, కానీ పాలేరు ఎమ్మెల్యే ఆదేశాలతో ఇక్కడ పని చేస్తున్నారని తెలంగాణలో కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆయన కూసుమంచిలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. అదిలాబాద్ లో ప్రారంభమైన తన యాత్ర ఖమ్మంలో ముగియనుందని, ఈ సభకు జనగర్జన పేరును పెట్టినట్లు తెలిపారు. అధికారమదాన్ని దించడానికే తాను పీపుల్స్ మార్చ్ పాదయాత్రను చేపట్టినట్లు చెప్పారు.

ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణను సాధించుకున్నామో.. ఆ లక్ష్యం నెరవేరలేదన్నారు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులపై దమ్ముంటే చర్చకు రావాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను ఎందుకు ఆపేసిందో చెప్పాలన్నారు. కాంగ్రెస్ హయాంలో వేసిన రోడ్లకు మధ్యలో స్తంభాలు, రంగులు వేయడం అభివృద్ధి కాదని విమర్శించారు.

సింగరేణిని ప్రయివేటుపరం చేస్తున్నారని, ఖమ్మం జిల్లాకు ఏమీ ఇవ్వకుండా సున్నా చూపెట్టారని మండిపడ్డారు. పాలేరు శాసన సభ్యుడిని కాంగ్రెస్ గుర్తుపై గెలిపిస్తే కాంట్రాక్టుల కోసం కేసీఆర్ దగ్గర అమ్ముకున్నాడని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నుంచి గెలిచినవారు బీఆర్ఎస్ లోకి వెళ్లాలనుకుంటే తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ మారితే అభ్యంతరం లేదన్నారు. పాలేరు ఎమ్మెల్యే ప్రజాస్వామ్య ద్రోహి అన్నారు. మీ ఓటుకు ఎవరైతే గౌరవం ఇస్తారో వారికి ఓటు వేయాలని ప్రజలకు భట్టి సూచించారు. ఓటును అమ్ముకునే నాయకులను గ్రామాల్లోకి రానివ్వవద్దన్నారు.

  • Loading...

More Telugu News