Manipur: మణిపూర్‌లో మళ్లీ అదే తీరు..చెలరేగిన హింస

Fresh Violence Erupted In Manipur

  • భద్రతా బలగాల కాల్పుల్లో మరణించిన వ్యక్తి మృతదేహంతో ఆందోళనకారుల ధర్నా
  • సీఎం ఇంటికి ఊరేగింపుగా తీసుకెళ్లే యత్నం
  • బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు

మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. కంగ్‌పోంక్పి జిల్లాలో చనిపోయిన మరో వ్యక్తిని రాజధాని ఇంఫాల్‌కు తీసుకురావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కర్ప్యూ నిషేధాజ్ఞలను పక్కనపెట్టి వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులు న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. దీంతో వారిని అదుపు చేసేందుకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. 

నిన్న ఉదయం జరిగిన తుపాకి కాల్పుల్లో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని ఇంఫాల్‌కు హృదయంగా చెప్పే ఖ్వైరాన్‌బండ్ బజార్‌కు తీసుకొచ్చి సంప్రదాయ శవపేటికలో ఉంచారు. ఈ క్రమంలో అక్కడ ఆందోళనకారులు పోగయ్యారు. మృతదేహాన్ని ముఖ్యమంత్రి నివాసం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్తామని హెచ్చరించారు. పోలీసుల అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు రోడ్ల మధ్యలో టైర్లు కాల్చారు. దీంతో అక్కడికి చేరుకున్న ఆర్ఏఎఫ్ సిబ్బంది బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టింది. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని శవాగారానికి తరలించారు. 

మరో ఘటనలో ఇదే జిల్లాలో నిన్న ఉదయం భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. హరావ్‌థెల్ గ్రామంలో ఆందోళనకారులు తొలుత రెచ్చగొట్టేలా కాల్పులకు పాల్పడడంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. కాగా, నెల రోజులకుపైగా జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటి వరకు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News