France unrest: అల్లర్లతో ఫ్రాన్స్ అట్టుడుకుతుంటే.. ఆ పక్కనే కూర్చుని తీరిగ్గా శాండ్‌విచ్ తింటున్న యువకుడు.. వైరల్ వీడియో ఇదిగో!
- మూడు రోజుల క్రితం ఆఫ్రికన్ కుర్రాడిని కాల్చి చంపిన పోలీసులు
- అప్పటి నుంచి అట్టుడుకుతున్న ఫ్రాన్స్
- దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఆందోళనలు
- దేశవ్యాప్తంగా 40 వేల మంది పోలీసుల మోహరింపు
టీనేజర్‌ను పోలీసులు కాల్చి చంపడంతో రేకెత్తిన ఆందోళనలు క్రమంగా ఫ్రాన్స్ అంతటా విస్తరిస్తున్నాయి. గురువారం వరుసగా మూడో రోజూ నిరసనలు కొనసాగాయి. ఆందోళనకారులను నిలవరించేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 40 వేల మంది పోలీసులను మోహరించింది. ఆందోళనకారులు శాంతించాలని, నిందితులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులను పెడచెవిన పెట్టిన ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు.
ఈ క్రమంలో నాంటెర్రెలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరుగుతుంటే ఆ పక్కనే ఓ డబ్బా వద్ద కూర్చున్న యువకుడు అదేమీ పట్టనట్టు తీరిగ్గా శాండ్‌విచ్ తింటున్నాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. పక్కనే అంత పెద్ద ఫైటింగ్ జరుగుతుంటే యువకుడు తనకేమీ సంబంధం లేనట్టు శాండ్‌విచ్ తింటూ కూర్చోవడంపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. కాగా, 17 ఏళ్ల ఆఫ్రికన్ కుర్రాడు నహేల్ ఎంను పోలీసులు నాంటెర్రెలోనే కాల్చి చంపారు.