Telangana: రాజా సింగ్ పై సస్పెన్షన్ ను తొలగించాలని రాష్ట్ర పార్టీ మనఃపూర్వకంగా కోరుకుంటోంది: విజయశాంతి
- ఈ అంశంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యమవుతున్నట్లు కార్యకర్తలు భావిస్తున్నారన్న సీనియర్ నేత
- బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి వ్యవహరిస్తుందన్న విజయశాంతి
- ఆలస్యమైనా అంతిమ నిర్ణయం అందరికీ మంచి చేసేలా ఉంటుందని ట్వీట్
ఇప్పటికే అనేక సమస్యలతో సతమతం అవుతున్న తెలంగాణ బీజేపీలో మరో అంశంపై రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై పార్టీ విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కార్యకర్తలు, నాయకులు బీజేపీ అదిష్ఠానాన్ని డిమాండ్ చేస్తున్నారు. విద్వేష వ్యాఖ్యలు చేసిన కారణంగా కొన్ని నెలల కిందట అదిష్ఠానం రాజా సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే, వేటు వేసినా కూడా రాజా సింగ్ మరే పార్టీలోనూ చేరలేదు. ఆయన బీజేపీ నేతగానే చెలామణి అవుతున్నారు. కార్యకర్తలు సైతం అదే భావనలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ ను తొలగించాలన్న డిమాండ్లు మరింత పెరిగాయి. తాజాగా ఈ విషయంపై పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి స్పందించారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యమవుతున్నట్లు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు. ఆలస్యమైనా అంతిమ నిర్ణయం అందరికీ మంచి చేసేలా ఉంటుందన్నారు. ‘బండి సంజయ్ గారితో సహా రాష్ట్ర పార్టీ నేతలంతా ఆ సస్పెన్షన్ తొలగించాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం. అలాగే జరుగుతుందని నమ్ముతున్నాం. ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు, కార్యకర్తలు ఉన్న భారతీయ జనతా పార్టీ తన కార్యకర్తలకు న్యాయం చేసుకోకుంటే ఇంత శక్తి వస్తదా. సరైన సమయంలో అంతా మంచే జరుగుతాది. కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా ఆదరించే బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి వ్యవహరిస్తుంది. ఆలస్యమైనట్లు కనిపించినా అంతిమ నిర్ణయం కచ్చితంగా అందరికీ మంచి చేసేదే అవుతుంది’ అని విజయశాంతి వరుస ట్వీట్లు చేశారు.