Grandhi Srinivas: నా గురించి నువ్వు చెబితే తెలుసుకోవాల్సిన స్థితిలో భీమవరం ప్రజలు లేరు సార్: పవన్ కు గ్రంథి శ్రీనివాస్ కౌంటర్

Grandhi Srinivas counters Pawan Kalyan

  • పవన్ పై మరోసారి ధ్వజమెత్తిన భీమవరం ఎమ్మెల్యే
  • కస్తూర్బా కాలేజీ కోసం సొంత స్థలం 30 సెంట్లు ఇచ్చామని గ్రంథి వెల్లడి
  • సొంత స్థలం ఇచ్చి కాలేజీకి తమ పేరు పెట్టుకున్నామని స్పష్టీకరణ
  • పవన్ చెప్పింది నమ్మడానికి ఇక్కడి ప్రజలు చెవిలో పువ్వులు పెట్టుకోలేదని వ్యాఖ్యలు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మరోసారి ధ్వజమెత్తారు. కస్తూర్బా జూనియర్ కాలేజి గురించి పవన్ చెప్పింది మొదట సరిగా వినలేదని, ఆ తర్వాత స్పష్టంగా విన్నానని తెలిపారు. కాలేజీలకు పేర్లు పెట్టుకోవాలంటే మీ ఆస్తులు ఇచ్చి అప్పుడు పేర్లు పెట్టుకోండి అని స్వయంగా చెప్పాడు... చాలా సంతోషం అని గ్రంథి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. 

"ప్రైవేటు స్థలంలో ఉన్న కస్తూర్బా జూనియర్ కాలేజీ కోర్టు ఉత్తర్వులతో భీమవరం నుంచి తరలి వెళ్లిపోతుంటే, ప్రభుత్వ స్థలమేదీ లేకపోవడంతో, మా సొంత స్థలం 30 సెంట్లు ఆ కాలేజీకి ఇచ్చి మా పేరు పెట్టుకున్నాం. నీకు ఫీడ్ బ్యాక్ ఇచ్చేది ఎవరో కానీ, అన్నీ అవాస్తవాలే చెబుతున్నారు. అది మా సొంత స్థలం... అప్పట్లో ఆ స్థలం విలువ రూ.3 కోట్లు... ఇప్పుడది రూ.9 కోట్ల విలువ పలుకుతోంది.

అంతేకాదు, ఏరియా ఆసుపత్రి కోసం మేమే 4 ఎకరాల భూమి కొని ఇవ్వడం జరిగింది. ఏదో, ప్రభుత్వ స్థలంలో కాలేజీ పెట్టి మా పేర్లు పెట్టుకున్నాం అంటే ఇక్కడ ప్రజలు నమ్మరు. రేపు అక్టోబరు 14కి నాకు 60 సంవత్సరాలు వస్తాయి. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే పోతాను. ఇక్కడ ప్రజలందరికీ నా గురించి తెలుసు సార్... ఎక్కడ్నించో వచ్చి నా గురించి చెబితే నమ్మడానికి భీమవరం ప్రజలేమీ చెవిలో పువ్వులు పెట్టుకోలేదు. అసలు, నా గురించి నువ్వు చెబితే తెలుసుకోవాల్సిన స్థితిలో ఇక్కడి ప్రజలు లేరు సార్. మా తాతల కాలం నుంచి మేమేంటో ఇక్కడివాళ్లకు బాగా తెలుసు" అని గ్రంథి శ్రీనివాస్ వివరించారు. 

పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటమిపాలవడం తెలిసిందే. గాజువాకలో పోటీ చేసి ఓడిన పవన్... భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ చేతిలో పరాజయం చవిచూశారు. 2019 ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ 3,900 ఓట్ల ఆధిక్యంతో పవన్ పై నెగ్గారు.

  • Loading...

More Telugu News