Pawan Kalyan: యువతను వాలంటీర్లుగా నియమిస్తే పారిశ్రామికవేత్తలుగా మారతారా?: పవన్ కల్యాణ్
- భీమవరంలో పవన్ కల్యాణ్ సభ
- పదేళ్లుగా జనసేన పార్టీ మార్పు కోసం పోరాడుతోందని వెల్లడి
- భీమవరంలో తనకు ఓటమి బాధ తెలియలేదని వ్యాఖ్యలు
- తనకు ముందుకు వెళ్లడమే తెలుసని ఉద్ఘాటన
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వారాహి యాత్రలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. తెలుగు జాతికి పోరాట స్ఫూర్తిని గుండెల్లో నింపిన అల్లూరి సీతారామరాజు గారికి శతకోటి వందనాలు అంటూ పవన్ కల్యాణ్ తన ప్రసంగం ప్రారంభించారు.
56 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు గారికి, నేను మొదట భారతీయుడ్ని అని చెప్పిన అంబేద్కర్ గారికి శతకోటి వందనాలు అని తెలిపారు. గత దశాబ్ద కాలంగా జనసేన పార్టీ మార్పు కోసం పోరాడుతోందని, ఓటమిపాలైనా ఎక్కడికీ పారిపోకుండా, సమాజంలోనే ఉన్నామని ఉద్ఘాటించారు.
భీమవరంలో ప్రజాదరణతో తనకు ఓటమి బాధ తెలియలేదని... మనకు గెలుపు ఓటములు ఉండవు... ముందుకు ప్రయాణించడమే తెలుసు అని వివరించారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసం, ఉపాధి కోసం, మెరుగైన భవిష్యత్ కోసం ఉద్యమాలు చేశామని తెలిపారు.
ఇష్టానుసారంగా పిచ్చి చట్టాలు చేస్తూ, అరాచకంగా ప్రభుత్వాన్ని నడిపిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆంగ్ల రచయిత జీకే చెస్టర్ టన్ ను పవన్ కల్యాణ్ ఉదహరించారు. ప్రభుత్వ అఘాయిత్యాల పట్ల ప్రజలు మౌనంగా ఉన్నారంటే సమాజం కుళ్లిపోయినట్టేనని భావించాలని అన్నారు.
ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో పచ్చని చెట్లు కూడా రోదిస్తున్నాయని, సీఎం పర్యటనల్లో నరికివేస్తుండడంతో చెట్లు మౌనంగా పోరాటం చేస్తున్నాయని వివరించారు. ప్రతిభ ఉన్న యువతకు పెట్టుబడి పెట్టే శక్తి లేదని, దళిత యువత, బీసీ యువత, ఈబీసీ యువతను వాలంటీర్లుగా నియమిస్తే వారు పారిశ్రామికవేత్తలుగా మారతారా? అని పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పేరుపెట్టుకుని యువత కోసం చేశారని నిలదీశారు.
"హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఐటీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు చేసిందేమిటి? గౌరవ వేతనం అని చెప్పి 2.5 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి వదిలేశారు. యువతను ప్రోత్సహిస్తే ఇక్కడివారిలో కూడా సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్ లు వెలుగులోకి వస్తారు. యువత ఎప్పటికీ వాలంటీర్లుగానే మిగిలిపోవాలా?" అని ప్రశ్నించారు. జనసేన అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకు రూ.10 లక్షల చొప్పున పెట్టుబడి అందిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.