Pawan Kalyan: తరాలు లేచిపోతాయి జాగ్రత్త... వైవీ సుబ్బారెడ్డికి కూడా వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్
- ముగిసిన పవన్ కల్యాణ్ వారాహి యాత్ర తొలి దశ
- భీమవరంలో బహిరంగ సభ
- వైసీపీ నేతలకు ఘాటు హెచ్చరికలు చేసిన జనసేనాని
- శ్రీవాణి ట్రస్ట్ లో అక్రమాలు నిజం కాదా? అని ప్రశ్నించిన వైనం
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర తొలిదశ నేటితో ముగిసింది. ఈ సాయంత్రం భీమవరంలో బహిరంగ సభ నిర్వహించిన పవన్ నిప్పులు చెరిగే ప్రసంగం చేశారు. వైసీపీ అధినాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు.
పర్సనల్ విషయాల జోలికి వస్తే వదిలిపెట్టనంటూ సీఎం జగన్ ను హెచ్చరించిన జనసేనాని... శ్రీవాణి ట్రస్ట్ విషయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కూడా టార్గెట్ చేశారు. 'దేవుడి సొమ్ము తిన్నవారు ఎవరైనా నాశనం అయిపోతారు... తరాలు లేచిపోతాయి జాగ్రత్త వైవీ సుబ్బారెడ్డి గారూ' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
"శ్రీవాణి ట్రస్ట్ విషయంలో అక్రమాలు జరిగింది నిజం కాదా? ఆలయ నిర్మాణాల కోసం కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారు?" అంటూ ప్రశ్నించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడా, లేడా...? జనసేన అధికారంలోకి రాగానే తప్పు చేసిన ప్రతి వైసీపీ నాయకుడిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.