Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర బీజేపీలో భారీ మార్పులు.. కిషన్‌రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు?
- కేంద్రమంత్రివర్గంలో లేదంటే జాతీయ నాయకత్వంలోకి బండి సంజయ్
- ఈటల, కోమటిరెడ్డికి కూడా కీలక పదవులు
- మూడు నాలుగు రోజుల్లో ప్రకటన?
తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు జరగబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమయ్యేలానే కనిపిస్తోంది. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి, సీనియర్ నేత జి.కిషన్‌రెడ్డికి అదనంగా పార్టీ పగ్గాలు అప్పగిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
బండి సంజయ్‌కు కేంద్రమంత్రి వర్గంలో లేదంటే పార్టీ జాతీయ నాయకత్వంలో బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మూడు నాలుగు రోజుల్లోనే అధిష్ఠానం నుంచి ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించడమే మేలని అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
బండి సంజయ్ హయాంలో తెలంగాణలో బీజేపీకి కావాల్సినంత హైప్ వచ్చింది. పలు ఎన్నికల్లో అధికారపార్టీకి ముచ్చెమటలు పట్టించింది. ఈ నేపథ్యంలో ఆయనకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని పార్టీ నిర్ణయించింది. అలాగే, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కూడా పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
బండి సంజయ్‌కు కనుక జాతీయ నాయకత్వంలో బాధ్యతలు అప్పగిస్తే ఆయన సామాజిక వర్గానికే చెందిన ఎంపీ ధర్మపురి అర్వింద్, లేదంటే రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావులలో ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.