raghunandan rao: రఘునందన్ రావుకు ఆ పదవి ఇవ్వాలంటూ జితేందర్ రెడ్డి ట్వీట్

BJP Jithender Reddy interesting tweet on party issues
  • దుబ్బాక ఎమ్మెల్యేకు జాతీయ అధికార ప్రతినిధి హోదా ఇవ్వాలని సూచన
  • రెండ్రోజుల క్రితం ట్వీట్ పైనా దుమారం
  • తన ట్వీట్ పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆవేదన
బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గురువారం చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు. ఇది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా చేయాలని ట్విట్టర్ లో పేర్కొన్నారు. నిన్న జితేందర్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ రాజకీయంగా దుమారం రేపింది. ఒక వ్యక్తి బర్రెలను తన్నుతూ వాహనంలోకి ఎక్కించే వీడియోను పోస్ట్ చేస్తూ,  బీజేపీ తెలంగాణ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్మెంట్ అవసరమని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్ ను బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్ లకు ట్యాగ్ చేశారు.

ఇది దుమారం రేపడంతో ఆయన మరో ట్వీట్ చేశారు. తన అభిప్రాయాలను బీఆర్ఎస్ నేతలు తప్పుగా ప్రచారం చేస్తున్నారని, బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించేవాళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో చెప్పే ప్రయత్నం చేశానన్నారు. మరోవైపు రాష్ట్ర బీజేపీలో కీలక మార్పులకు పార్టీ జాతీయ నాయకత్వం సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించవచ్చునని ప్రచారం సాగుతోంది. సంజయ్ కి కేంద్రమంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.
raghunandan rao
BJP

More Telugu News