Kinjarapu Ram Mohan Naidu: పలాసలో అర్ధరాత్రి హైడ్రామా..టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్ అరెస్ట్

TDP mp rammohan naidu mla ashok arrested in palasa
  • పట్టణ టీడీపీ అధ్యక్షుడు నాగరాజు ఇంటిముందున్న కల్వర్ట్‌‌పై అదికారుల అభ్యంతరం
  • అర్ధరాత్రి కల్వర్ట్ తొలగింపునకు అధికారుల యత్నం
  • తన ఇంటికి దారి లేకుండా చేస్తున్నారంటూ నాగరాజు ఆరోపణ
  • అధికారుల చర్యలకు నిరసనగా ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్ బాబు ఆందోళన
  • టీడీపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • మంత్రి సిదిరి అప్పలరాజు అదేశాలతోనే తనపై వేధింపులంటూ నాగరాజు ఆరోపణ
పలాస పట్టణంలో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరిట టీడీపీ నేతలపై వేధింపులకు దిగుతున్నారంటూ ఆందోళనకు దిగిన ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పలాస పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు తన ఇంటికి వెళ్లే దారిలో ఉన్న సాగునీటి కాలువపై పదిహేనేళ్ల క్రితం కల్వర్టు నిర్మించుకున్నారు. అయితే, ఈ కల్వర్టు నిర్మాణం అక్రమమంటూ ఇటీవల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిందంటూ కల్వర్టు తొలగించేందుకు సిద్ధమయ్యారు. శనివారం అర్ధరాత్రి కూల్చివేత సామాగ్రితో కల్వర్టు వద్దకు చేరుకున్నారు. దీంతో, అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకుడు నాగరాజును ఇబ్బంది పెట్టడానికే కల్వర్టు కూల్చేందుకు రెడీ అయ్యారని టీడీపీ నేతలు ఆరోపించారు. 

నాగరాజుకు మద్దతుగా  టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్, మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటూ పలువురు టీడీపీ నాయకులు ఘటనాస్థలంలో ఆందోళన చేపట్టారు. దీంతో, పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి. అధికారులు, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

కాగా, మంత్రి సిదిరి అప్పలరాజు ఆదేశాలతోనే అధికారులు తన ఇంటికి దారి లేకుండా చేస్తున్నారని టీడీపీ నేత నాగరాజు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాననే కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని నాగరాజు ఆరోపించారు.
Kinjarapu Ram Mohan Naidu
Srikak
Telugudesam
YSRCP

More Telugu News