KTR: వరంగల్ వచ్చే ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి: కేటీఆర్
- ప్రధాని మోదీని డిమాండ్ చేసిన తెలంగాణ మంత్రి
- ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు ఇంకెప్పుడంటూ ప్రశ్న
- కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్న హామీని గుర్తుచేసిన మంత్రి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8న వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పలు ప్రశ్నలు సంధిస్తోంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఇంకెప్పుడు అమలు చేస్తారని నిలదీస్తోంది. మోదీ పర్యటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే వరంగల్ కు రావాలని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఇంతవరకూ అమలు చేయనందుకు మోదీ క్షమాపణ చెప్పాలన్నారు.
ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 360 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని మంత్రి గుర్తుచేశారు. ఇప్పటికీ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీ ఏమైందని మంత్రి కేటీఆర్ నిలదీశారు.. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రిపేరింగ్ షెడ్ ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.
వరంగల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పీఓహెచ్) వర్క్ షాప్, మెగా టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఈ సభ కోసం బీజేపీ తెలంగాణ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.