NCP: ఏడాది కిందట శివసేన.. ఇప్పుడు ఎన్సీపీ..!
- మహారాష్ట్రలో మరో పార్టీలో చీలిక
- 2022 జూన్‌లో శివసేన నుంచి బయటికొచ్చిన ఏక్‌నాథ్ షిండే
- ఇప్పుడు ఎన్సీపీపై తిరుగుబాటు చేసిన అజిత్ పవార్
- గతంలోనూ ఓ సారి ఎన్సీపీని చీల్చే ప్రయత్నం చేసిన అజిత్
మహారాష్ట్రలో ప్రధాన ప్రతిపక్షం ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. 29 మంది ఎమ్మెల్యేలతో పాటు వెళ్లి బీజేపీ, ఏక్‌నాథ్ షిండే కూటమిలోని ప్రభుత్వంలో చేరేందుకు అజిత్ పవార్ సిద్ధమయ్యారు. ఇలానే ఏడాది కిందట కూడా శివసేనలో చీలిక వచ్చింది. నాడు ప్రభుత్వం కుప్పకూలిపోగా.. ఇప్పుడున్న ప్రభుత్వానికి మరింత బలమొచ్చి చేరింది.
2022 జూన్ 21న శివసేనలో చీలికకు బీజం పడింది. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్‌లోని సూరత్‌కు ఏక్‌నాథ్ షిండే వెళ్లిపోయారు. తర్వాత అస్సాంలోని గువహతికి వెళ్లారు. షిండే వర్గంలోకి వెళ్లే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిపోయింది. 10 రోజుల హైడ్రామా తర్వాత శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహా వికాస్ ఆఘాఢీ ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత జరిగిన పరిణామలతో ఎన్నికల గుర్తును కూడా ఉద్ధవ్ థాక్రే వర్గం కోల్పోయింది.
సరిగ్గా ఏడాది తర్వాత ఎన్సీపీపై దెబ్బపడింది. ఈ రోజు 29 మందితోపాటు వెళ్లి షిండే సర్కారుకు అజిత్ పవార్ మద్దతు పలికినట్లు తెలుస్తోంది. సాయంత్రానికల్లా డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ .. అజిత్‌కు సొంత బాబాయే కావడం గమనార్హం.
నిజానికి అజిత్ పవార్ ఇలా చీలిక తీసుకురావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఒకసారి ఇలాంటి ప్రయత్నమే చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ సీట్లు రాలేదు. బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసి.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినన్ని సీట్లు గెలిచినా శివసేన తర్వాత మాట మార్చింది. దీంతో ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో పాటు వెళ్లి.. బీజేపీకి అజిత్ పవార్ మద్దతు ప్రకటించారు. ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. కానీ శరద్ పవార్ మంత్రాంగంతో అజిత్ వెనక్కి తగ్గారు. మరి ఈ సారి ఏమవుతుందో?