TDP Chief: రాజేశ్ మృతదేహాన్ని ఇండియాకు చేర్చేందుకు సాయం చేయండి.. కేంద్ర మంత్రి జైశంకర్ కు చంద్రబాబు లేఖ

TDP Chief Chandrababu letter to central minister jaishanker
  • అమెరికాలోని ఫ్లోరిడాలో సముద్రంలో మునిగి చనిపోయిన రాజేశ్
  • ఇద్దరు పిల్లలను కాపాడి నీటిలో గల్లంతైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్
  • మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చిన మెరైన్ సిబ్బంది
అమెరికాలోని ఫ్లోరిడాలో చనిపోయిన అద్దంకి వాసి రాజేశ్ కుమార్ మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు సాయం చేయాలంటూ కేంద్ర విదేశీవ్యవహారాల మంత్రి జైశంకర్ కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాజేశ్ మృతిపై చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబంతో సహా బీచ్ లో సేదతీరేందుకు వెళ్లిన రాజేశ్.. ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. రాజేశ్ కుటుంబానికి సంతాపం ప్రకటించిన టీడీపీ అధినేత.. ఆయన మృతదేహాన్ని వీలైనంత త్వరగా అద్దంకికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కేంద్రమంత్రిని కోరారు.

ఏం జరిగిందంటే..
బాపట్ల జిల్లాకు చెందిన పొట్టి రాజేశ్ కుమార్ ఉద్యోగరీత్యా అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బ్రిడ్స్ వాటర్ కమ్యూనిటీలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో వీకెండ్ సందర్భంగా శనివారం కుటుంబంతో సహా జాక్సన్ విల్ విట్లర్ బీచ్ కు వెళ్లారు. బీచ్ లో స్నానం చేస్తుండగా అలల తాకిడి పెరిగింది. దీంతో నీటిలో కొట్టుకుపోతున్న పిల్లలను రాజేశ్ కాపాడారు. అయితే, రాజేశ్ మాత్రం సముద్రంలో గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన మెరైన్ సిబ్బంది రాజేశ్ ను కాపాడేందుకు ప్రయత్నించినా ఉపయోగంలేకుండా పోయింది. రాజేశ్ మృతదేహాన్ని వారు ఒడ్డుకు చేర్చారు.
TDP Chief
Chandrababu
jaishanker
letter
addanki
Rajesh

More Telugu News