Nara Lokesh: తల్లీ... నేను కూడా బాడీ షేమింగ్ బాధితుడ్నే: నారా లోకేశ్
- నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర
- నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో మహిళా శక్తితో లోకేశ్ కార్యక్రమం
- మహిళలతో లోకేశ్ ముఖాముఖి సమావేశం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చేరుకుంది. ఇవాళ ఆయన నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో 'మహిళా శక్తితో లోకేశ్' కార్యక్రమంలో భాగంగా మహిళలతో ముఖాముఖి సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఓ మహిళా సైకాలజిస్టు మాట్లాడుతూ, మన విద్యా వ్యవస్థలో మానసిక సంక్షేమం, శారీరక సంక్షేమం అనే అంశాలను పూర్తిగా విస్మరిస్తున్నామని విచారం వ్యక్తం చేశారు. ఓ సైకాలజిస్టుగా, ఓ తల్లిగా ఈ మాటలు చెబుతున్నానని అన్నారు.
దీనివల్ల పిల్లల్లో ఆత్మన్యూనత భావం, కుంగుబాటు, బాడీ డిస్మోర్ఫియా వంటి సమస్యలు తలెత్తుతాయని, దాంతో చిన్న వయసులోనే పిల్లలు డయాబెటిస్, ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. ఈ అంశాలను ఇతర దేశాలు ఓ ముప్పుగా పరిగణించి చర్యలు తీసుకుంటున్నాయని ఆమె వివరించారు.
చాలా దేశాలు ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుకు కూడా ఎడ్యుకేషన్ కర్రిక్యులమ్ లో స్థానం కల్పించి, ఆ సబ్జెక్టును తప్పనిసరిగా పాస్ అవ్వాలన్న నిబంధన తీసుకువచ్చాయని వెల్లడించారు. రేపు టీడీపీ గెలిచి అధికారంలోకి వస్తే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, మన స్కూళ్లలో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆమె కోరారు.
అందుకు లోకేశ్ స్పందిస్తూ... తల్లీ, నేను కూడా బాడీ షేమింగ్ బాధితుడ్నే అని వెల్లడించారు. శరీరాకృతి పట్ల హేళన ఎదుర్కొంటున్నవారిలో నేను కూడా ఉన్నాను అని వివరించారు.
"శాసనసభలో మా నాయకుడు అచ్చెన్నాయుడి గారిని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున బాడీ షేమింగ్ చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. దేవుడు అందరినీ ఒకేలా తయారుచేయడు కదా. నేను ఏమనుకుంటానంటే... కేజీ నుంచి పీజీ వరకు సిలబస్ మొత్తం మార్చేయాలని భావిస్తాను. సామాజిక బాధ్యత, భావోద్వేగ, శారీరకపరమైన బాధ్యత అనేవి లేకుండా పోయాయి.
అత్యంత సంతోషకర దేశం ఫిన్లాండ్ నే తీసుకుంటే... వాళ్లు సమగ్ర విద్యావిధానంపై దృష్టి పెడతారు. వాళ్ల నైతిక విలువల వ్యవస్థ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఆ నైతిక విలువలే వారిని కాపాడుతున్నాయి. టీడీపీ కూడా ఈ అంశంపైనే దృష్టి పెడుతుంది. మేం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే కేజీ నుంచి పీజీ వరకు కర్రిక్యులమ్ ను మార్చడంపై చర్యలు తీసుకుంటాం" అని వివరించారు.