West Bengal: ఎలక్షన్ డ్యూటీ తప్పించుకునేందుకు అదే ఎన్నికల్లో నిలబడ్డారు.. పశ్చిమ బెంగాల్ లో విద్యా వాలంటీర్ల ఎత్తుగడ
- ఇంట్లో జరిగే పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు మాస్టర్ ప్లాన్
- స్వతంత్ర అభ్యర్థులుగా పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్
- ఎన్నికల విధులకు దూరంపెట్టిన అధికారులు
ఓవైపు కుటుంబ సభ్యుల పెళ్లి.. అదే సమయంలో పంచాయతీ ఎన్నికలు జరగనుండడంతో విద్యా వాలంటీర్లు మాస్టర్ ప్లాన్ వేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనడం తప్పనిసరయ్యేలా ఉందని, దానిని తప్పించుకోవాలని కొత్త ఎత్తువేశారు. ఎలక్షన్ డ్యూటీని తప్పించుకునేందుకు అదే ఎన్నికల్లో నిలబడ్డారు. దీంతో అధికారులు వారిని ఎన్నికల విధులకు దూరం పెట్టారు. తమకు కావాల్సింది కూడా అదే కావడంతో వారంతా హ్యాపీగా ఫీలయ్యారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిందీ విచిత్రం.
పశ్చిమ బెంగాల్ లో ఈ నెల 8న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల విధుల్లో విద్యా వాలంటీర్లు పాల్గొనడం తప్పనిసరి. ఈమేరకు అధికారులు డ్యూటీ చార్ట్ సిద్ధం చేస్తున్నారు. అయితే, అలిపురద్వార్ జిల్లా జటేశ్వర్ గ్రామంలో ఎన్నికల రోజే పలువురి ఇళ్లల్లో వివాహాలు జరగనున్నాయి. గ్రామంలోని ఏడుగురు విద్యా వాలంటీర్లు తమ ఇంట్లో జరిగే పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు ఎన్నికల డ్యూటీ తప్పించుకోవాలని ప్లానేశారు. ఏ కారణం చెప్పినా సెలవు ఇచ్చే పరిస్థితి ఉండదని భావించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిలబడ్డారు. స్వతంత్ర అభ్యర్థులుగా రూ.500 డిపాజిట్ కట్టి నామినేషన్ వేశారు. ఎన్నికల బరిలో ఉండడం వల్ల అధికారులు వారిని ఎలక్షన్ విధులకు దూరంపెట్టారు.