Telangana: చెక్ బౌన్స్ వివాదం.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన కాంగ్రెస్ నేతలు
- మాజీ మంత్రి వినోద్ కుమార్ ఫిర్యాదు
- మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుపై కేసు
- బంజారాహిల్స్ స్టేషన్ లో కేసు నమోదు
కాంగ్రెస్ పార్టీ నేతలు ఇద్దరి మధ్య చెక్ బౌన్స్ వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ దాకా చేరింది. మాజీ మంత్రి వినోద్ కుమార్ ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. చెల్లని చెక్కు ఇచ్చి ప్రేమ్ సాగర్ తనను మోసం చేశారంటూ వినోద్ కుమార్ ఫిర్యాద చేశారు. గత ఎన్నికల సమయంలో రూ.25 లక్షలు తీసుకున్నారని, తిరిగివ్వాలని కోరగా చెక్కు ఇచ్చారని తెలిపారు. ఆ చెక్కు బ్యాంకులో వేయగా బౌన్స్ అయిందని వినోద్ కుమార్ ఆరోపించారు. దీంతో తన డబ్బు తిరిగివ్వాలని ఎన్నిమార్లు కోరినా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. దీనిపై వినోద్ కుమార్ తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి ఇప్పటికే కోర్టు నుంచి ప్రేమ్ సాగర్ రావుకు నోటీసులు కూడా అందాయి. మరోవైపు, గడ్డం వెంకటస్వామి కుమారుడు గడ్డం వినోద్ కుమార్ వచ్చే ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కిందటి ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా బెల్లంపల్లి నుంచి శాసన సభకు పోటిచేసిన వినోద్ కుమార్.. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బెల్లంపల్లి టికెట్ ఆశించే వారిలో వినోద్ కుమార్ కూడా ఉన్నారని సమాచారం.