G. Kishan Reddy: కేసీఆర్ కోరుకున్నట్లుగానే మిమ్మల్ని అధ్యక్షుడిగా చేశారనే విమర్శలపై కిషన్‌రెడ్డి సమాధానం ఇదే!
- తనకు పార్టీయే శ్వాస.. సిద్ధాంతం కోసం పని చేసే కార్యకర్తనన్న కిషన్ రెడ్డి
- ఈ రోజు సాయంత్రం బండి సంజయ్, తాను హైదరాబాద్ వెళ్తున్నామన్న కొత్త చీఫ్
- తెలంగాణకు రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్
కేసీఆర్ ప్రభుత్వం కోరుకున్నట్లుగానే తనను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారనే విమర్శలపై కిషన్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో విలేకరుల సమావేశం చివరలో మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడిగారు. ఓ మీడియా ప్రతినిధి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం కోరుకున్నట్లుగానే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మిమ్మల్ని నియమించారంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోందని ప్రశ్నించారు. దీనికి కిషన్ రెడ్డి చిన్నగా నవ్వుతూ.. చూస్తారు కదా అని సమాధానమిచ్చారు.
ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తాను రెండుసార్లు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశానని, ఇప్పుడు నాలుగోసారి తనకు బాధ్యతలు అప్పగించారన్నారు. తాను ఈ రోజు వరకు ఎప్పుడూ పార్టీని ఏదీ అడగలేదన్నారు. పార్టీ ఏది ఆదేశిస్తే అది పాటిస్తూ వస్తున్నానన్నారు.
1980 నుండి ఈ రోజు వరకు పార్టీకి సైనికుడిగా పని చేశానని, తనకు పార్టీకి మించింది ఏదీ లేదన్నారు. పార్టీయే తన శ్వాస అన్నారు. పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతం కోసం పని చేసే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను అన్నారు. జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అందరితో కలిసి, సమన్వయం చేసుకొని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చే లక్ష్యంతో ముందుకు సాగుతామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకు రావాలనే ఆలోచనతో జాతీయ నాయకత్వం ఉందన్నారు.
సమష్టి కార్యాచరణ, ప్రణాళికతో తాము ముందుకు సాగుతామన్నారు. ఈ రోజు సాయంత్రమే హైదరాబాద్ వెళ్లి రాష్ట్ర నాయకులను కలుస్తానని చెప్పారు. తాను, బండి సంజయ్.. ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్తున్నామన్నారు. జులై 8న ప్రధాని మోదీ వరంగల్ వస్తున్నారని, ఈ రెండు రోజులు వరంగల్ సభ ఏర్పాట్లపై చర్చించి, సభను విజయవంతం చేస్తామన్నారు. వరంగల్ లో ప్రధాని మోదీ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ)కు భూమిపూజ చేయనున్నారని చెప్పారు. వరంగల్ ను రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారుస్తామన్నారు. దీంతో ఇక్కడ 5000 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తెలంగాణకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రావడం ఇదే మొదటిసారి అన్నారు.
దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమైన నాయకులతో కూడిన సమావేశాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్ నాయకులు సమావేశానికి హాజరవుతారన్నారు. దక్షిణ భారతంలో బీజేపీ తీసుకోవాల్సిన చర్యలు, రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చిస్తామన్నారు. దక్షిణాదిన బీజేపీని మరింత బలోపేతం చేయాలన్నారు.
చివరిగా బండి సంజయ్ గురించి మరో మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తుండగా... అందరికీ ధన్యవాదాలు అంటూ కిషన్ రెడ్డి వెళ్లిపోయారు.