Team India: తండ్రి ఎలక్ట్రీషియన్, క్రికెట్ కిట్ కొనే పరిస్థితి లేదు.. అయినా భారత జట్టులోకి వచ్చేశాడు.. తిలక్ వర్మ ప్రస్థానం ఇదీ!
- దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న హైదరాబాదీ
- సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తిలక్
- తక్కువ కాలంలోనే జాతీయ జట్టులోకి వచ్చిన ఆటగాడు
తెలుగు రాష్ట్రాల నుంచి భారత జట్టులో చోటు దక్కించున్న కొత్త ఆటగాడిగా ఠాకూర్ తిలక్ వర్మ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. హైదరాబాద్ కు చెందిన ఈ యువ ఆటగాడు వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో పోటీ పడే భారత టీమ్‌కు ఎంపికయ్యాడు. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన తిలక్ ఎవ్వరి అండా లేకుండా స్వయం ప్రతిభతో వెలుగులోకి వచ్చాడు. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ లో సత్తా చాటి భారత జట్టు చోటు సంపాదించుకున్న అతని ప్రయాణం ఎంతో స్ఫూర్తి దాయకం.
కోచ్ దృష్టిలో పడి..
20 ఏళ్ల తిలక్ హైదరాబాద్ బండ్లగూడలో నంబూరి నాగరాజు, గాయత్రి దేవి దంపతుల రెండో కుమారుడు. నాగరాజు ఎలక్ట్రీషియన్ కాగా.. గాయత్రి గృహిణి. కోచ్ సలామ్ బయాష్ పరిచయం అయ్యేంతవరకూ తాను క్రికెటర్ అవుతానని, టీమిండియాలోకి వస్తానని తిలక్ అనుకోలేదు. తిలక్ చిన్పప్పుడు టెన్నిస్ బాల్ తో గల్లీ క్రికెట్ ఆడేవాడు. బార్కస్ లోని ఓ గ్రౌండ్‌లో ప్రతి ఆదివారం ఆడుకునేవాడు. ఓ రోజు ఆ మైదానానికి వచ్చిన కోచ్ సలామ్ బయాష్ కంట్లో పడ్డాడు. అప్పటికి 11 ఏళ్ల వయసున్న తిలక్ ఆడుతున్న విధానం బయాష్ కు చాలా నచ్చింది. దాంతో, అతని వద్దకు వెళ్లి ‘నువ్వు ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నావు? ఏ జట్టుకు ఆడుతున్నావు?’ అని అరా తీశాడు. కోచింగ్ లేదు ఏమీ లేదు.. ప్రతి ఆదివారం సరదాగా ఆడుకుంటానంతే అని తిలక్ సమాధానం ఇచ్చాడు.
రోజూ 40కి.మీ. ప్రయాణం
తిలక్ లో సహజ ప్రతిభను పసిగట్టిన బయాష్.. కోచింగ్ ఇస్తే మంచి క్రికెటర్ అవుతాడని గ్రహించాడు. ఇదే విషయం తిలక్ తల్లిదండ్రులకు చెప్పగా.. కోచింగ్ ఇప్పించ్చేంత ఆర్థిక స్తోమత తమకు లేదని వద్దన్నారు. కానీ, తాను ఉచితంగా కోచింగ్ ఇస్తానని, ఇతర ఖర్చులూ తానే చూసుకుంటానని సలామ్ వారికి నచ్చజెప్పారు. లింగంపల్లిలోని తన అకాడమీకి తిలక్ ను తీసుకెళ్లాడు. తొలుత రోజూ బండ్లగూడ నుంచి లింగంపల్లికి 40 కి.మీ. బైక్ పై వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడు తిలక్. అతని కష్టం చూడలేక.. తల్లిదండ్రులు లింగంపల్లికి షిఫ్ట్ అయ్యారు. తిలక్ కు మొదట్లో మంచి బ్యాట్, క్రికెట్ కిట్ కూడా ఉండేది కాదు. సలామ్, తండ్రి నాగరాజు స్నేహితులు చేసిన సాయంతో వాటిని సమకూర్చుకున్న తిలక్ రోజూ గంటల కొద్దీ శ్రమించాడు. దాంతో, ఏడాది తిరిగేలోపే హైదరాబాద్ అండర్14 టీమ్‌లో చోటు దక్కించుకున్న తిలక్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అండర్16, అండర్19 విభాగాల్లో హైదరాబాద్ జట్టు తరఫున దుమ్మురేపాడు. దాంతో, హైదరాబాద్ క్రికెట్ లో అతని పేరు మార్మోగింది.
దేశవాళీల్లో దుమ్ముదులిపేశాడు..
విజయ్ మర్చంట్ ట్రోఫీ, కూచ్ బెహార్ ట్రోఫీ , కల్నల్ సీకే నాయుడు (అండర్23) వంటి దేశవాళీ టోర్నీల్లోనూ పరుగుల మోత మోగించడంతో 2018లో అండర్19 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం అతనికి లభించింది. ఆ టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన తిలక్ తర్వాతి రెండేళ్లు దేశవాళీ టోర్నీల్లో చెలరేగిపోయాడు. 2019లో హైదరాబాద్ రంజీ జట్టులోకి వచ్చి సత్తా చాటాడు. ఇక, 2022లో రూ.20 లక్షల కనీస ధరతో ఐపీఎల్ వేలంలోకి వచ్చిన తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ ఏకంగా రూ.1.70 కోట్లకు సొంతం చేసుకోవడంతో అతని దశ తిరిగింది.
ఇక ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవడంతో తిలక్ ఆటపైనే దృష్టి పెట్టాడు. రోహిత్, సూర్యకుమార్ వంటి ప్లేయర్లతో ఆట.. సచిన్, జయవర్థనే మార్గనిర్దేశంలో అతను మరింత రాటుదేలాడు. 2022 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 397 పరుగులతో రాణించడంతో ఈ ఏడాది కూడా అతనిని ముంబై తీసుకుంది. ఆ జట్టు నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సీజన్ లో తిలక్ ఏకంగా 164 స్ట్రయిక్ రేట్‌తో 343 పరుగులు చేశాడు. టీమిండియాలోకి వచ్చే సత్తా తనకు ఉందని చాటి చెప్పాడు. ఇప్పుడు వెస్టిండీస్ టూర్ కు ఎంపికై తన కలను నిజం చేసుకుంటున్నాడు.
చిన్నప్పుడు ఐపీఎల్ మ్యాచ్ చూస్తానంటే కొన్ని కారణాల వల్ల కోచ్ సలామ్ బయాష్ అతనికి టికెట్లు సమకూర్చలేకపోయాడు. స్టార్ క్రికెటర్లను దగ్గరి నుంచి చూసే అవకాశం రాలేకపోయిందని తిలక్ చాలా బాధపడ్డాడు. కానీ, పదేళ్లు తిరిగేలోపే తనే స్టార్ అయ్యాడు. అతని కోసం చాలా మంది స్టేడియానికి వస్తున్నారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహా ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులంతా హైదరాబాద్ లోని తిలక్ వర్మ ఇంటికి వచ్చారు. సక్సెస్ అంటే ఇదే కదా!