India: కెనడా, బ్రిటన్ దేశాల్లో ఖలిస్థాన్ పోస్టర్లు... ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్న భారత్

India condemns Khalistan posters in Britain and Canada
  • ఇటీవల పలు దేశాల్లో భారత్ కు వ్యతిరేకంగా ఖలిస్థాన్ ఉద్యమం
  • భారత ఎంబసీలపై దాడులకు దిగుతున్న ఖలిస్థాన్ మద్దతుదారులు
  • తాజాగా పోస్టర్లతో కలకలం
  • ఖలిస్థాన్ ధోరణులను ఖండిస్తున్నట్టు భారత్ ప్రకటన
ఇటీవల పలు దేశాల్లో ఖలిస్థాన్ అనుకూలవాదుల నిరసనలు, ఇతరత్రా వ్యతిరేక చర్యలు అధికమయ్యాయి. తాజాగా కెనడా, బ్రిటన్ దేశాల్లో ఖలిస్థాన్ పోస్టర్లు వెలిశాయి. ఆయా దేశాల్లోని భారత దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఈ పోస్టర్లు అంటించినట్టు తెలుస్తోంది.

దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ధోరణులు తమకు ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరింద్ బాగ్చి మాట్లాడుతూ, పోస్టర్ల వ్యవహారాన్ని భారత ప్రభుత్వం ఖండిస్తోందని, ఇప్పటికే ఈ విషయాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వివరించారు. భావవ్యక్తీకరణ పేరిట అతివాద, ఉగ్రవాద శక్తులకు ఎలాంటి అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. 

"ఇది భావవ్యక్తీకరణకు సంబంధించిన విషయం మాత్రమే కాదు... హింసను ప్రోత్సహించడం, వేర్పాటువాదాన్ని పురిగొల్పడం, ఉగ్రవాదానికి మద్దతు పెంచుకోవడం వంటి అంశాలను భావవ్యక్తీకరణ పేరిట దుర్వినియోగం చేయడమే" అని వివరించారు. 

విదేశాల్లో ఉన్న భారత దౌత్యవేత్తలు, ఇతర సిబ్బంది, కార్యాలయాలు, విదేశాల్లో భారత ప్రభుత్వ కార్యాచరణల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అంశం అని ఆరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు. 

ఇటీవల అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఖలిస్థాన్ మద్దతుదారులు భారత ఎంబసీలను లక్ష్యంగా చేసుకోవడం అధికమైంది. వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతుండడం పట్ల కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
India
Khalistan Posters
Britain
Canada

More Telugu News