Atchannaidu: జగన్ ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుంది అందుకే!: అచ్చెన్నాయుడు
- జగన్ పాలనపై అన్ని వర్గాల్లో అసంతృప్తి అన్న అచ్చెన్న
- ఎన్నికలు త్వరగా ఉండేలా చూడాలని ఢిల్లీ పెద్దల వద్దకు వెళ్లారని ఆరోపణ
- చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని సర్వేలు చెబుతున్నాయని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లి ఎన్నికలు త్వరగా వచ్చేలా చూడాలని పెద్దల కాళ్లు పట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు గురువారం విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందన్నారు.
ఎన్నికల్లో పొత్తులు సహజమేనని, 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి పొత్తులతోనే ముందుకు వెళ్లారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జగన్ పాలన పట్ల అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయన్నారు. జగన్ సొంత వర్గంలోనూ తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. జగన్ గ్రాఫ్ పడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని పలు సర్వేలు చెబుతున్నాయని అచ్చెన్న అన్నారు. రివర్స్ టెండరింగ్ తో పోలవరం ప్రాజెక్టును జగన్ గోదావరిలో ముంచారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఆయన వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ఉద్ఘాటించారు. కానీ ఈ రెండింటినీ జగన్ దెబ్బతీశారన్నారు. ఆరు అంశాలతో తాము సూపర్ సిక్స్ ను విడుదల చేశామని, దసరా నాటికి పూర్తి అంశాలతో మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు.