Somireddy Chandra Mohan Reddy: దేవుడిపై ప్రమాణం చేసినంత మాత్రాన చేసిన దోపిడీ మాయమవుతుందా?: అనిల్ కుమార్ కు సోమిరెడ్డి కౌంటర్

Somireddy counters former minister Anil Kumar Yadav

  • నెల్లూరులో యువగళం సందర్భంగా కాకాణి, అనిల్ కుమార్ పై లోకేశ్ ఫైర్
  • ఇద్దరూ అవినీతిపరులేనంటూ చిట్టా చదివి వినిపించిన వైనం
  • దేవుడిపై ప్రమాణం చేద్దామంటూ అనిల్ కుమార్ సవాల్
  • ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రమాణం చేసి వచ్చే కదా దోచుకున్నారు అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యలు

నెల్లూరు సిటీలో యువగళం సాదయాత్ర సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లపై తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. 

మాజీ మంత్రి అవినీతి కార్యకలాపాలు, భూ దందాలు అన్నీ ఇన్నీ కావని లోకేశ్ ఏకంగా ఓ జాబితా చదివి వినిపించారు. అందుకు అనిల్ కుమార్ స్పందిస్తూ, దేవుడిపై ప్రమాణం చేద్దామంటూ లోకేశ్ కు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ కు కౌంటర్ ఇచ్చారు. 

ప్రమాణం చేసినంత మాత్రాన చేసిన దోపిడీ మాయమవుతుందా అనిల్ కుమార్...? అని ఎత్తిపొడిచారు. "మంత్రి, మాజీ మంత్రి అవినీతిని లోకేశ్ ఆధారాలతో సహా బయటపెట్టాడు. ఉత్తుత్తి ప్రమాణాలతో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయకుండా, జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి సీబీఐ విచారణ జరిపించుకొని మీ నిజాయతీని నిరూపించుకోండి" అంటూ సోమిరెడ్డి హితవు పలికారు. 

"దేవుడిపై ప్రమాణం చేస్తాను... నా నిజాయతీని నిరూపించుకుంటాను అని అనిల్ కుమార్ యాదవ్ అంటున్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వెంటనే ప్రమాణం చేస్తారు. అలా ప్రమాణం చేసి కూడా ఎంత దోచుకున్నారో ప్రజలకు తెలుసు. అనిల్ కుమార్ యాదవ్, అతని బినామీలు నాలుగేళ్లలో ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు కొన్నారో, ఎన్ని ఆక్రమించారో లోకేశ్ చిట్టా బయటపెట్టారు.... సర్వేపల్లిలో మంత్రి పాపాలచిట్టా విప్పారు. నెల్లూరులో మాజీమంత్రి,  సిటింగ్ ఎమ్మెల్యే అవినీతి భాగోతాన్ని బట్టబయలు చేశారు. 

నీతి, నిజాయతీ ఉంటే ఉత్తుత్తి ప్రమాణాలతో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయకుండా వారి అవినీతి, దోపిడీపై వారే సీబీఐ విచారణ కోరాలి. సీబీఐ విచారణ కోరాలంటే రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి... సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడం. రెండోది... సీబీఐ విచారణ జరిపించాలని న్యాయస్థానాలు ఆదేశించడం. 

రాష్ట్రంలో అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రిని ఒప్పించి మంత్రి, మాజీ మంత్రి సీబీఐ విచారణ కోరి, వారి సచ్ఛీలతను నిరూపించుకోవాలి. ప్రభుత్వ పెద్దలు చేసిన అవినీతిపై మీరు వేసే సిట్లు... మీ కోసమే పనిచేస్తాయి. ప్రజల కోసం పనిచేయవని అందరికీ తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రాబాబు 6 లక్షల కోట్లు కొట్టేశాడని మీరు, మీ నాయకుడే కూశారు. ఆనాడు కూసిన కూతలన్నీ ఏమయ్యాయి... అధికారంలోకి వచ్చాక ఏం నిరూపించారు?

 జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని కేంద్ర దర్యాప్తు సంస్థలే తేల్చాయి. ఆ ఆస్తే ఇప్పుడు రెండు మూడు లక్షల కోట్లు అయ్యుంటుంది. దానికి ప్రజలకు సమాధానం చెప్పండి. జగన్, అతని ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు నిజాయతీపరులు అయితే రాష్ట్రం ఇంతగా ఎందుకు దిగజారుతుంది?” అంటూ సోమిరెడ్డి నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News