Alamgir Khan Tareen: పాకిస్థాన్ క్రికెట్ ఫ్రాంచైజీ యజమాని ఆత్మహత్య
- ముల్తాన్ సుల్తాన్ జట్టు యజమాని బలవన్మరణం
- పాక్ క్రికెట్, వ్యాపార వర్గాల్లో విషాదం
- ఆత్మహత్యకు కారణాలు ఇంకా వెల్లడి కాని వైనం
పాకిస్థాన్ క్రికెట్ లోనూ, ఆ దేశ వ్యాపార వర్గాల్లోనూ విషాదం చోటుచేసుకుంది. పీఎస్ఎల్ (పాకిస్థాన్ సూపర్ లీగ్) ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్స్ యజమాని ఆలంగీర్ ఖాన్ తరీన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తరీన్ వయసు 63 సంవత్సరాలు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది తెలియరాలేదు. లాహోర్ లోని తన ఇంట్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు.
అలంగీర్ ఖాన్ తరీన్ కు పాకిస్థాన్ లో మినరల్ వాటర్ వ్యాపారం ఉంది. దేశంలోని అతిపెద్ద నీటి శుద్ధి కర్మాగారం ఆయనదే. ముల్తాన్ సుల్తాన్స్ ఫ్రాంచైజీని తొలుత మేనల్లుడితో కలిసి కొనుగోలు చేసిన తరీన్... తర్వాత కాలంలో ఫ్రాంచైజీని పూర్తిగా సొంతం చేసుకున్నారు.
ముల్తాన్ సుల్తాన్ జట్టు పీఎస్ఎల్ లో నిలకడగా ఆడే జట్లలో ఒకటిగా పేరుగాంచింది. 2021లో ఈ జట్టు చాంపియన్ గా నిలిచింది. అంతేకాదు, గత మూడు సీజన్లలో ముల్తాన్ సుల్తాన్ ఫైనలిస్టు కూడా. అలంగీర్ ఖాన్ తరీన్ ఆత్మహత్య వార్తలు పాక్ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. తమ యజమాని మృతి పట్ల ముల్తాన్ సుల్తాన్స్ సారథి మహ్మద్ రిజ్వాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.