Kerala: కేరళలో అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకిన టీనేజర్ మృతి
- స్వేచ్ఛగా జీవించే అమీబా కారణంగా అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకిందన్న మంత్రి
- అలప్పుజా పానవల్లికి చెందిన పదిహేనేళ్ల బాలుడు మృతి చెందినట్లు వెల్లడి
- గతంలోను ఐదు కేసులు నమోదయ్యాయన్న వీణా జార్జ్
స్వేచ్ఛగా జీవించే ఏక కణ జీవి అమీబా కారణంగా కేరళలోని అలప్పుజాలో అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకి ఓ యువకుడు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అలప్పుజాలోని పానవల్లి తీర ప్రాంతానికి చెందిన పదిహేనేళ్ల బాలుడు ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి బారినపడ్డాడు. బాలుడి మరణాన్ని మంత్రి ధృవీకరించారు. అలాగే రాష్ట్రంలో ఇంతకుముందు ఐదు అరుదైన ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్లు తెలిపారు.
తొలిసారిగా 2016లో అలప్పుజాలోని తిరుమల వార్డులో నమోదైనట్లు తెలిపారు. మలప్పురంలో 2019, 2020లలో రెండు కేసులు నమోదయ్యాయని, 2020లో కోజికోడ్, 2022లో త్రిసూర్‌లో నమోదైనట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు జ్వరం, తలనొప్పి, వాంతులు. కాగా, ఈ వ్యాధి సోకిన వారంతా మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రి చెప్పారు. తద్వారా ఈ అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ మరణాల రేటు 100 శాతంగా ఉంది.
ఇన్ఫెక్షన్కు కారణమయ్యే అమీబా ఏక కణ జీవులు నిశ్చల నీటిలో కనిపిస్తాయని మంత్రి తెలిపారు. డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం... స్వేచ్ఛా జీవి, నాన్-పారాసిటిక్ అమీబా బ్యాక్టీరియా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి, మనిషి మెదడుకు ఇన్ఫెక్షన్ కలుగజేస్తుంది.