Me-Ganism: వీగన్ క్రేజ్ ముగియనుందా... రాబోయేది మీ-గనిజం ట్రెండేనా...?

Future food trend may powered wit AI

  • 3డీ ప్రింటెడ్ మీల్ కూడా రావొచ్చంటున్న డెలివరూ సంస్థ
  • ఎడిబల్ బ్యూటీకి ప్రాధాన్యత
  • బ్రీత్ ప్రింట్స్‌తో మీకేం కావాలో రెస్టారెంట్‌వారే సప్లయి చేసే ట్రెండ్
  • స్నాక్ టు ద ఫ్యూచర్ :2040 నివేదికలో వినూత్న అంచనాలు

ఆదిత్య 369 సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో భవిష్యత్ కాలానికి వెళ్లిన హీరోహీరోయిన్ల నడుం దగ్గర ఉన్న ఒక బెల్టులో ఉన్న అలారం మోగుతుంది. మీకు ఆకలి వేస్తుందనే దానికి సూచన అని ఆ సినిమాలో భవిష్యత్ కాలంలో ఉన్న వ్యక్తి చెప్పడం చూసే ఉంటారు. అలాంటి టెక్నాలజీ భవిష్యత్ లో రాబోతోందని డెలివరూ అనే సంస్థ చెబుతోంది. 

ఆకలి వేయడం గురించి మాత్రమే ఆ సినిమాలో చెప్పి ఉండొచ్చుగాక, అసలు మీరు ఏం తినాలి, మీకు ఎలాంటి ఆహారం తింటే మంచిదనేది మీ శ్వాసను బట్టి తెలిపే సాంకేతికత త్వరలోనే రాబోతుందట. ఇప్పటిదాకా మనకు వీగనిజం తెలుసు. ఇకపై వచ్చేది మీ-గనిజం అని డెలివరూ సంస్థ అంచనా వేస్తోంది. 

అది కూడా 2040 నాటికి ఈ మీ-గనిజం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే వుందంటోందా సంస్థ. అంతే కాదు... ఇలాంటి ఆసక్తికరమైన అంచనాలతో 'స్నాక్ టు ద ఫ్యూచర్: 2040' శీర్షికన ఓ నివేదికను విడుదల చేసింది. 

2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ ట్రెండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనే అంచనాలతో రూపొందించిన ఈ నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా ఆహార పరిశ్రమ నుంచి శాస్త్రవేత్తలు, సాంకేతిక, ఆవిష్కరణ రంగాలకు చెందిన మేధావుల అభిప్రాయాలున్నాయి. 

ఆసక్తికరమైన ఈ అధ్యయనంలో వెల్లడించిన కీలకాంశాలు ఏమిటంటే...

బ్రీత్ ప్రింట్స్ 

సాంకేతిక ఉపకరణాలతో ఏదైనా సాధ్యమేనా అంటే, సాధ్యమే అని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా బ్రీత్ టెక్‌తో మీ శ్వాసతోనే... మీరు ఏ ఫుడ్ తింటారు, ఆ ఆహారం మీ ఆరోగ్యంపై చూపే ప్రభావం కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుందట. రాబోయే కాలంలో హోటల్స్, రెస్టారెంట్‌లలో ఈ బ్రీత్‌టెక్ టెక్నాలజీ ఎక్కువగా వినియోగించే అవకాశాలూ అధికమేనని అంచనా వేసింది.

మీ-గనిజం 

సెలబ్రెటీలు మొదలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల వరకూ వీగనిజం అని ఇప్పుడంటున్నారు కానీ ఇకపై రానున్నది మీ-గనిజం. ఏమిటీ దాని స్పెషాలిటీ అంటే, హైపర్ పర్సనలైజ్డ్ డైట్. ఏఐ సాంకేతికతతో వ్యక్తిగత పోషక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిబడింది.

పర్సనల్ ఏఐ 

మీ ఆహార ప్రాధాన్యతలు, అవసరాలకనుగుణంగా మీకు ఏం కావాలనేది పర్సనల్ ఏఐ చెబుతుంది! ఆదిత్య 369లో చెప్పినట్లు మెదడు పని చేయాల్సిన అవసరం లేదు. పర్సనల్ ఆహారపు అలవాట్ల డేటా సేకరించిన కంప్యూటర్ ఏఐ సాయంతో మీ ఫుడ్ ప్రోగ్రామ్ ను డిజైన్ చేస్తుంది.

ఎడిబల్ బ్యూటీ 

ఆహారం, అందం ఎన్నడూ లేనంత గొప్పగా కలిసిపోతాయి. యాంటీ ఏజింగ్ ఐస్‌క్రీమ్ లాంటి ఎడిబల్ బ్యూటీ ప్రొడక్ట్స్ రాజ్యమేలనున్నాయి. మీరు అందంగా కనిపించాలనుకుంటే.. కేవలం మీ అందాన్ని ఇనుమడింపజేసే ఆహార పదార్థాలే మీకు అందించబడతాయి. మీ దేహ సౌందర్యాన్ని పెంచే ఆహార పదార్థాలు ఏవి అనేది ఏఐ చూసుకుంటుంది.

3డీ ప్రిటెండ్ మీల్ ప్లాన్స్ 

ఫుడ్ ప్రిపరేషన్ ఇకపై మరింత సులభం కానుంది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీలో అత్యాధునిక ఆవిష్కరణల కారణంగా ఇది సాధ్యమవుతుందట. 3డీ ప్రింటెడ్ మీల్స్‌తో రుచి, లుక్ పరంగా వంకలు పెట్టే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అత్యంత కచ్చితత్వంతో మీకిష్టమైన ఆహార పదార్థాలు రెడీ అవుతాయి.

  • Loading...

More Telugu News