Indian Railways: రైలు ప్రయాణికులకు తీపి కబురు.. ఆ రైళ్లలో టికెట్ ధర 25 శాతం తగ్గింపు
- ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ తరగతుల ఛార్జీలు తగ్గింపు
- యాభై శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉండే రైళ్లలో అవకాశం
- రాయితీ తక్షణమే అమల్లోకి
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ చల్లటి కబురు చెప్పింది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లతో సహా దేశం అంతటా నడుస్తున్న పలు రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ తరగతుల ఛార్జీలను 25 శాతం వరకు తగ్గిస్తున్నట్లు రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. యాభై శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉండే వందే భారత్ ఎక్స్ ప్రెస్, శతాబ్ది ఎక్స్ ప్రెస్, అనుభూతి, విస్టాడోమ్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది. ఛార్జీలు పోటీ రవాణా మార్గాలపై ఆధారపడి ఉంటాయని రైల్వే బోర్డు తెలిపింది.
సెలవులు, పండుగల సమయాల్లో నడిచే ప్రత్యేక రైళ్లలో ఈ పథకం వర్తించదని తెలిపింది. వనరులను గరిష్ఠ స్థాయిలో వినియోగించేందుకు వీలుగా ఏసీ కోచ్ లలో ప్రయాణాలపై డిస్కౌంట్ ప్రకటించే అధికారాన్ని జోనల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు అప్పగించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ రాయితీ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే, ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి చార్జీలు వాపస్ ఉండదని స్పష్టం చేసింది.