Andhra Pradesh: మేనిఫెస్టోపై చర్చకు రమ్మంటూ టీడీపీ నేతలకు బొత్స సవాల్‌

Botsa Satyanarayana Challenged TDP Leaders over their Manifesto
  • ఎన్నికలకు ఏడాది ముందే హీటెక్కుతున్న ఏపీ రాజకీయాలు
  • 2014 మేనిఫెస్టో తీసుకుని రావాలని సవాల్ విసిరిన బొత్స
  • టీడీపీ, వైసీపీ పాలనపై చర్చిద్దాం రమ్మంటూ ఛాలెంజ్
ఆంధ్రప్రదేశ్ లో 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై చర్చించేందుకు సిద్ధమని మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏ పార్టీ ఏం చేసిందనేది చర్చిద్దాం రమ్మని ఛాలెంజ్ చేశారు. టీడీపీ నేతలు కొంతమంది నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. తప్పుడు విమర్శలు చేయడం మాని టీడీపీ అధికారంలో ఉన్న కాలం (2014 నుంచి 2019)లో ప్రజలకు ఇచ్చిన హామీలలో ఎన్ని అమలు చేశారో చెప్పాలని నిలదీశారు. 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వైసీపీ చేసిన పనులను వివరించేందుకు తాము సిద్ధమని మంత్రి బొత్స ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉండగానే ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్ల పర్వం మొదలైంది. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ నేతల విమర్శలపై స్పందిస్తూ.. రాష్ట్ర ప్రజలకు ఎవరేం చేశారో చర్చిద్దాం రమ్మంటూ టీడీపీ నేతలకు ఛాలెంజ్ విసిరారు. మరోవైపు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఇప్పటికే మొదటి విడత మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో మ‌హిళ‌లు, యువ‌త‌, రైతులు, బీసీలు, ఇంటింటికీ మంచినీరు, పూర్ టు రిచ్ వంటి ఆరు అంశాల‌కు ప్రాధాన్యం కల్పించింది. తాజాగా రెండో విడత మేనిఫెస్టోను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో రాష్ట్ర అభివృద్ధికి పెద్ద పీట వేయనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
Andhra Pradesh
Botsa
YSRCP
TDP
Manifesto
challenge
ap minister

More Telugu News