Pawan Kalyan: వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు: పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు!

AP Women Commission notices to Pawan Kalyan

  • ఏపీలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమన్న పవన్ కల్యాణ్
  • మహిళల మిస్సింగ్‌పై ఆధారాలివ్వాలంటూ మహిళా కమిషన్ నోటీసులు
  • ఆయనకు ఏ అధికారి సమాచారమిచ్చారో తమకు చెప్పాలన్న వాసిరెడ్డి పద్మ

ఏపీలో మహిళల మిస్సింగ్, వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఏలూరులో మహిళల మిస్సింగ్‌పై పవన్ చేసిన ఆరోపణలపై ఆధారాలివ్వాలని స్పష్టం చేసింది.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మహిళల భద్రతకు భంగం కలిగేలా ఉన్నాయని ఏపీ మహిళా కమిషన్ చైర్‌‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. డైలాగ్స్ కొట్టి వెళ్లడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు.

రాజకీయాల కోసం పవన్ దిగజారుతున్నారని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సీటు కోసం ఎవరినైనా ఫణంగా పెడతారా అని ప్రశ్నించారు. మహిళల మిస్సింగ్‌ గురించి ఆయనకు ఏ అధికారి చెప్పారో తమకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులు లేవా? అని నిలదీశారు.

వారాహి విజయయాత్రలో భాగంగా నిన్న ఏలూరులో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల అదృశ్యం, అక్రమ రవాణా వెనుక వైఎస్సార్‌సీపీ నేతలు ఉన్నారని.. వాలంటీర్లు రహస్యంగా సమాచారాన్ని సేకరిస్తున్నారని ఆరోపించారు. ‘‘వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రతి గ్రామంలో వాలంటీర్లను పెట్టి.. కుటుంబంలో ఎంత మంది ఉన్నారు.. వారిలో మహిళలు ఎందరు, వితంతువులున్నారా అని ఆరా తీస్తున్నారు. ఈ పాలనలో అదృశ్యమైన 30 వేల మందిలో 14 వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణం” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News