Harish Rao: ఆ పార్టీలు అధ్యక్షుల్ని మార్చినా.. బీఆర్ఎస్ గెలుపును మాత్రం ఆపలేరు: హరీశ్ రావు
- తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వడం లేదని ఆగ్రహం
- దక్షిణాదిపై బీజేపీది చిన్నచూపు అని ఆరోపణ
- కాంగ్రెస్ కర్ణాటకలో రూ.4వేల పెన్షన్ హామీని అమలు చేయాలని సూచన
కొన్ని పార్టీలు అధ్యక్షుల్ని మార్చినా , ఔట్ డేటెడ్ లీడర్లకు పదవులు కట్టబెట్టినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. దక్షిణాదిపై బీజేపీ సర్కార్ ది చిన్నచూపు అని, దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ ఏమైనా ఇచ్చిందా అంటే అది కేవలం శుష్కప్రియాలు, శూన్యహస్తాలు అని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.4వేల పెన్షన్ హామీని ముందుగా కర్ణాటకలో అమలు చేయాలని సూచించారు. పటాన్చెరులో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, ఫ్రీడమ్ పార్కులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు.
కాంగ్రెస్పాలిత రాష్ట్రాలలో రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలు ఉన్నాయా? అని నిలదీశారు. ఆ పార్టీలలో ప్రజలు తిరస్కరించిన లీడర్లు, స్క్రాప్ లీడర్లు చేరితే పోయేదేమీలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కులు చేసినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేరన్నారు. బీఆర్ఎస్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందన్నారు.