Perni Nani: మనిషి జన్మ ఎత్తినోడు ఇలా మాట్లాడుతాడా?: పవన్ కల్యాణ్‌పై నిప్పులు చెరిగిన పేర్ని నాని
- వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్
- మీ కుటుంబ మహిళలకు ఓ న్యాయం.. వారికి ఓ న్యాయమా? అని నిలదీత
- జగన్ ను ఏకవచనంతో పిలిచి చూడాలని ఆగ్రహం
- వాలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబు, పవన్ లకు వణుకు అని వ్యాఖ్య
వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకుగాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని పేర్ని నాని సోమవారం డిమాండ్ చేశారు. చంద్రబాబు కాళ్లు మొక్కితే తమకు ఇబ్బంది లేదని, వాలంటీర్లపై తప్పుడు మాటలు మాత్రం వద్దని అన్నారు. మీ కుటుంబంలోని మహిళలను అన్నారని లారీ ఎక్కి చెబుతున్నారని, మరి వాలంటీర్లపై మీరు మాట్లాడిందేమిటో చెప్పాలన్నారు. వారికి క్షమాపణలు చెప్పకుంటే మీ బాధకు ఓ ధర్మం.. వాలంటీర్లకు ఓ ధర్మమా? అన్నారు.
అట్టుకు అట్టు ఖాయం
జగన్ ను ఇక నుండి ఏకవచనంతో పిలుస్తానని పవన్ చెబుతున్నారని, అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నానన్నారు. కానీ మా ఇంటి నుండి మీ ఇంటికి ఎంత దూరమో.. మీ ఇంటి నుండి మా ఇంటికి అంతే దూరమని గుర్తుంచుకోవాలన్నారు. మీరు ఏకవచనంతో సంబోధిస్తే మేం ఏక, ద్వి, త్రివచనంతో పలకడం ఖాయమన్నారు. అట్టుకు రెండు అట్లు వేస్తామన్నారు. పవన్ ఒక్కడికే నోరు.. నాలుక లేదని, వైసీపీ జెండా మోసే ప్రతి కార్యకర్తకూ ఉన్నాయన్నారు. జగన్ ను ఏకవచనంతో పిలిచి చూడండి.. అట్టుకు అట్టు ఖాయమన్నారు.
పవన్ కల్యాణ్ రికార్డులివీ..
పవన్ కల్యాణ్ నోటికి హద్దు లేకుండా మాట్లాడుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు. ఆయన మాటల్లో చంద్రబాబుపై ప్రేమ మాత్రమే కనిపించిందన్నారు. చంద్రబాబు హయాంలో మహిళల మిస్సింగ్ గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? అని నిలదీశారు. ఈ సందర్భంగా 2015 నుండి 2022 వరకు మహిళల మిస్సింగ్ కు సంబంధించి ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ ను వెల్లడించారు. పోలీసుల రికార్డుల్లోను ఇవే ఉన్నట్లు చెప్పారు.
2015 నుండి 2018 వరకు 3వేలకు పైగా 18 ఏళ్లకు పైబడిన యువతులు అదృశ్యమయ్యారని, 2018లో 4వేల పైకి చేరుకుందని, 2019 జనవరి నుండి మే వరకు 2,484 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయన్నారు. టీడీపీ హయాంలో మొత్తంగా 16వేలకు పైగా మిస్సింగ్ కేసులు నమోదు కాగా, 2015లో 263, 2016లో 484, 2017లో 891, 2018లో 463, 2019లో 313 ట్రేస్ కాని కేసులు ఉన్నాయన్నారు. అలాగే తమ ప్రభుత్వ హయాంలోను 2020లో 381, 2021లో 461, 2022లో 392 మంది యువతులు ట్రేస్ కాలేదన్నారు. గత ప్రభుత్వంలో మిస్ అయిన వాటి గురించీ మాట్లాడాలని, కానీ వాలంటీర్లపై విమర్శలు సరికాదన్నారు.
పవన్ తప్పుడు లెక్కలు చెబుతూ విషపు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏం మాట్లాడమంటే అది మాట్లాడటం ఏమిటని నిలదీశారు. పవన్ 30 వేలమంది యువతులు మిస్సయ్యారంటున్నారని, ఆ లెక్క ఉంటే ఆధారాలు చూపించాలన్నారు. మీడియా సమావేశం అంటే మనం చెప్పేది చెప్పి వెళ్లిపోవడం కాదని, ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. ఎవరో ఏదో చెబితే గుడ్డిగా మాట్లాడటం సరికాదన్నారు. పవన్ హేయంగా, కిరాతకంగా మాట్లాడారన్నారు.
వాలంటీర్ల వ్యవస్థ అంటే గజగజ
జగన్ ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ... వాలంటీర్ల వ్యవస్థ అంటే పవన్, చంద్రబాబుకు వణుకు వస్తోందన్నారు. అందుకే ఈ ఆరోపణలు అన్నారు. గతంలో సోనియా గాంధీతో కలిసి చంద్రబాబు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రజల్లో జగన్ సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. ఏపీలో జగన్ బలం 2.5 లక్షల వాలంటీర్లు అన్నారు. వారు ఎనలేని సేవలు చేస్తూ జగన్ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారన్నారు. అందుకే వాలంటీర్లను చెడ్డవారిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పవన్.. ఇది నీకు ధర్మమా.. ఇదే నీ నీతా అని ప్రశ్నించారు.
పేరుకు తాను నీతిమంతుడ్నని, అబద్దాలు చెప్పనని అంటుంటారని, కానీ ఇవేనా మీ నిజాలు అని దుయ్యబట్టారు. వాలంటీర్లు ప్రతి ఇల్లు తిరిగి ఒంటరి మహిళల రికార్డులను తీసుకొని అసాంఘిక శక్తులకు ఇస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. నరంలేని నాలుక చంద్రబాబు లబ్ధి కోసం ఎలాంటి మాటలైనా మాట్లాడుతుందా? అని నిలదీశారు. తాను చంద్రబాబు, పవన్ కు ఒకటే చెబుతున్నానని.. రేపు మీ ప్రభుత్వం వస్తే వాలంటర్ల వ్యవస్థను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టగలరా? అని సవాల్ చేశారు. వాలంటీర్లలో మెజార్టీ మహిళలేనని చెప్పారు.
వాలంటీర్లు ఇంతగా సేవ చేస్తుంటే మనిషి జన్మ ఎత్తినవారు ఎవరైనా ఇలా మాట్లాడుతారా? అని దుయ్యబట్టారు. నీకంటే, చంద్రబాబు కంటే, మనలాంటి రాజకీయ నాయకులకంటే వాలంటీర్ పిల్లలు గొప్పగా సేవ చేస్తున్నారన్నారు. పవన్.. ఇది మీ జీవితానికి మాయని మచ్చ కాదా? అలాంటి వారిపై నిందలు వేస్తారా? దిక్కుమాలిన రాజకీయ పదవుల కోసం దిగజారి మాట్లాడాలా? అభం శుభం తెలియని వారిపై అలా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. రామోజీ రావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తప్పుడు లెక్కలు చదవడమే తెలుసు అన్నారు.
పవన్ కల్యాణ్ లో విజ్ఞత ఉంటే, దోసకాయ గింజంత మంచితనం ఉంటే వాలంటీర్లపై పేలిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ వారు మా అమ్మను, భార్యను, తల్లిని తిడుతున్నారని పవన్ చెబుతున్నారని, కానీ వైసీపీ మీ కుటుంబం ఆడవారి గురించి పల్లెత్తు మాట అనలేదని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం పిల్లల్ని రెచ్చగొట్టడం కోసం ఇలా మాట్లాడుతున్నారన్నారు.
ఎవరో కొంతమంది తప్పుడు వెదవలు మీ భార్య, తల్లి, పిల్లల గురించి తప్పుడు మాటలు మాట్లాడారని మీరు బాధపడుతున్నారు.. బహిరంగంగా లారీ ఎక్కి మీ బాధను వెళ్లబోసుకుంటున్నారు.. మరి 2.5 లక్షల మంది వాలంటీర్ల వ్యక్తిత్వాన్ని మీరు కించపరుస్తూ మాట్లాడే భాషకు ఎవరు సమాధానం చెబుతారు? అని నిలదీశారు. మీకు అకౌంటబులిటీ లేదా? అని ప్రశ్నించారు. ఫేస్ బుక్, సోషల్ మీడియాలో కొందరు వెధవలు మీ కుటుంబం గురించి మాట్లాడినప్పుడు.. మీరు వాలంటీర్లపై అలా మాట్లాడితే వారితో సమానం కారా? అని విమర్శించారు. వాలంటీర్ల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడటం సరికాదన్నారు.
వాలంటీర్లు వుమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారని, రెడ్ లైట్ ఏరియాకు అమ్మేస్తున్నారని ఆరోపణలు చేయడాన్ని పేర్ని నాని ఖండించారు. మీరు చెబితే చాగంటి ప్రవచనంలా వినాలా? అని ఎద్దేవా చేసారు. పవన్ తీరు చూస్తుంటే అత్తారింటికి దారేదిలో స్వామీజీ గెటప్ లా ఉందన్నారు. మరోసారి వాలంటీర్ల గురించి తప్పుడు మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు. మీ వ్యక్తిత్వం దైవత్వం.. వాలంటీర్ల వ్యక్తిత్వం నీచమా? అన్నారు. ఓ వైపు పవన్ వారిని కించపరుస్తూ మాట్లాడగా, మరోవైపు జనసేన వారిపై సానుభూతి ట్వీట్ చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.
కొల్లేరుపై అవగాహన ఉందా?
కొల్లేరు విషయంలోను పవన్ విమర్శలను పేర్ని నాని తప్పుబట్టారు. ఇదివరకు ఇక్కడ 20 లక్షల పక్షులు, 65 లక్షల చేప జాతులతో కొల్లేరు కళకళలాడేదని పవన్ చెబుతున్నారని, ఆయన వచ్చి లెక్కబెట్టారా? అని మండిపడ్డారు. పర్యావరణ రక్షణ కోసం మేమూ కట్టుబడి ఉన్నామన్నారు. కొల్లేరును విషతుల్యంగా మారుస్తున్నారనడం సరికాదన్నారు. 2014 నుండి 19 వరకు ప్రశ్నించకుండా ఏం చేశారో చెప్పాలన్నారు.
అసలు కొల్లేరు గురించి పవన్ కు ఏం తెలుసని నిలదీశారు. ఇక్కడ ఎన్ని ఊర్లు ఉన్నాయి.. దారి ఎటు? తెలుసా? అన్నారు. రామోజీ రాస్తాడు.. చంద్రబాబు వాట్సాప్ లో మీకు పంపిస్తారు.. లారీ ఎక్కి మీరు చదువుతారు.. అని పవన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. పవన్ కు కొల్లేరుపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. అప్పులపై మాట్లాడుతూ.. జగన్ కంటే చంద్రబాబు హయాంలోనే ఎక్కువ అప్పులు అయ్యాయన్నారు. జగన్ అభివృద్ధి, సంక్షేమం కోసం అప్పు చేస్తున్నట్లు చెప్పారు.