Brian Lara: వెస్టిండీస్ లో భారత జట్టు పర్యటనపై లారా స్పందన

Brian Lara opines on Team India tour in West Indies
  • ఈ నెల 12 నుంచి కరీబియన్ దీవుల్లో భారత్ టూర్
  • తొలుత రెండు టెస్టుల సిరీస్ లో ఆడనున్న భారత్, విండీస్
  • భారత్  అగ్రశ్రేణి జట్టు అని పేర్కొన్న లారా
  • తమ యువ జట్టు కచ్చితంగా పోటీ ఇస్తుందని వెల్లడి
ఈ నెల 12 నుంచి వెస్టిండీస్ లో భారత జట్టు పర్యటన షురూ కానుంది. తాజాగా వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించలేక చతికిలపడిన వెస్టిండీస్ జట్టు బలమైన టీమిండియాను ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. టెస్టుల్లో మేటి జట్టుగా కొనసాగుతున్న టీమిండియాకు ఆతిథ్య విండీస్ కనీస పోటీ ఇవ్వగలదా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, కరీబియన్ బ్యాటింగ్ లెజెండ్, విండీస్ జట్టు మెంటార్ బ్రియాన్ లారా స్పందించారు. భారత్ తో టెస్టు సిరీస్ లో వెస్టిండీస్ జట్టు తప్పకుండా మెరుగైన ప్రదర్శన కనబర్చుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా గట్టి జట్టు అని, ఈ సిరీస్ లో విండీస్ పోరాట పటిమ ప్రదర్శిస్తుందని భావిస్తున్నానని లారా తెలిపారు. 

భారత్-విండీస్ సిరీస్ ద్వారా ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ 2023-25 సీజన్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరిగే టెస్టు సిరీస్ ను కీలకమైనదిగా భావిస్తున్నట్టు లారా తెలిపారు. 

టీమిండియా ఇప్పుడు సొంతగడ్డ, విదేశీగడ్డ అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా గెలిచే స్థాయికి చేరుకుందని, అలాంటి అగ్రశ్రేణి జట్టుతో తాము మ్యాచ్ లు ఆడబోతున్నామని పేర్కొన్నారు. అగ్రశ్రేణి జట్లతో ఆడేటప్పుడే ఆటగాళ్లలో ప్రతిభ బయటికి వస్తుందని, క్రెయిగ్ బ్రాత్ వైట్ నాయకత్వంలోని విండీస్ యువ ఆటగాళ్ల బృందం ఈ పర్యటనను సద్వినియోగం చేసుకుంటుందని భావిస్తున్నట్టు లారా అభిప్రాయపడ్డారు. 

వెస్టిండీస్ పర్యటనలో భారత్ రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. టెస్టు సిరీస్ లో భాగంగా తొలి టెస్టు జులై 12న డొమినికాలో ఆరంభం కానుంది. ఇప్పటికే వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత ఆటగాళ్లు నెట్స్ లో ముమ్మరంగా సాధన చేస్తున్నారు.
Brian Lara
West Indies
Team India
Test Series

More Telugu News