Khammam Boy: పెంపకం భారమై కుమారుడిని శిశుగృహకు అప్పగించిన తల్లి.. దత్తత తీసుకున్న ఇటలీ దంపతులు
- కుమారుడిని పెంచలేక పదేళ్ల క్రితం ఖమ్మం శిశుగృహకు అప్పగించిన తల్లి
- ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న బాలుడు
- నాలుగు నెలల కౌన్సెలింగ్ తర్వాత ఇటలీ దంపతులతో వెళ్లేందుకు బాలుడి అంగీకారం
- ఇటలీ దంపతులకు బాలుడిని అప్పగించిన కలెక్టర్
కుమారుడిని పెంచలేక ఇబ్బందులు పడుతున్న ఓ తల్లి పదేళ్ల క్రితం ఆ చిన్నారిని ఖమ్మం శిశుగృహకు అప్పగించింది. మహిళా సంక్షేమశాఖ పిల్లాడిని అనాథగా ప్రకటించి సంరక్షిస్తోంది. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న బాలుడిని దత్తత ఇవ్వనున్నట్టు పేర్కొంటూ ఆ వివరాలను సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) వెబ్సైట్లో ఉంచారు.
వివాహమై చాలా కాలమే అయినా పిల్లలు లేకపోవడంతో ఎవరినైనా దత్తత తీసుకోవాలని భావించిన ఇటలీకి చెందిన దంపతులు ఆ వివరాలు చూసి అధికారులను సంప్రదించారు. ప్రభుత్వ దత్తత నిబంధనల ప్రకారం అన్ని అంశాలను పరిశీలించి దత్తతకు అంగీకరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దత్తత తీసుకునే వారితోపాటు ఎనిమిదేళ్ల వయసు దాటిన పిల్లల స్వీయ అంగీకారం తప్పనిసరి. దీంతో బాలుడికి నాలుగు నెలలపాటు అధికారులు కౌన్సెలింగ్ ఇవ్వడంతో దత్తత వెళ్లేందుకు అంగీకరించాడు. దీంతో దత్తత ప్రక్రియ పూర్తి చేశారు. నిన్న ఖమ్మం వచ్చిన ఇటలీ దంపతులకు కలెక్టర్ వీపీ గౌతమ్ బాలుడిని అప్పగించారు.