IMD: ఐఎండీ జారీ చేసే అలర్ట్ లకు అర్థం ఇదే..!
- 24 గంటల వ్యవధిలో నమోదయ్యే వర్షపాతానికి సూచన
- రవాణా వ్యవస్థపై వర్ష ప్రభావానికి సూచికగా ఆరెంజ్ అలర్ట్
- ప్రాణ నష్టం జరిగే ప్రమాదానికి హెచ్చరికే రెడ్ అలర్ట్
వర్షాకాలంలో, తుపాను సమయంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్, ఎల్లో, గ్రీన్ అలర్ట్ లు జారీ చేయడం చూస్తూనే ఉంటాం.. మరి ఈ కలర్ అలర్ట్ లకు అర్థమేంటో తెలుసుకుందాం. మూడు నాలుగు రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీలో యమునా నది ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చరించింది. ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. వివిధ రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఐఎండీ జారీ చేసే కలర్ అలర్ట్ లు నాలుగు రకాలు.. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. వాతావరణ పరిస్థితులను నిశితంగా పరిశీలించి రాబోయే ఐదు రోజుల్లో వర్షాలు లేదా తుపాను ప్రభావాన్ని అంచనా వేసి, దాని తీవ్రత ఆధారంగా అధికారులు అలర్ట్ లు జారీ చేస్తారు.
వర్ష సూచనలకు సంబంధించిన అలర్ట్ ల విషయానికి వస్తే..
24 గంటల వ్యవధిలో..
- 64.5 మిల్లీమీటర్ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసినపుడు గ్రీన్ అలర్ట్ జారీ చేస్తారు. ఈ హెచ్చరికకు ఎలాంటి అప్రమత్తత అవసరం లేదని అర్థం.
- 64.5 మిల్లీమీటర్ల నుంచి 115.5 మిల్లీమీటర్ వర్షపాతానికి ఎల్లో అలర్ట్.. ఈ హెచ్చరిక జారీ అయితే అలర్ట్ గా ఉండాలని సూచన
- 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.5 మిల్లీమీటర్ల వర్షపాతానికి ఆరెంజ్ అలర్ట్.. రవాణా వ్యవస్థ (రోడ్డు, రైలు, వాయు) పై వర్ష ప్రభావం ఉంటుందని అర్థం. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చనే సూచన ఈ అలర్ట్ లో ఉంటుంది.
- 204.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనే అంచనా వేస్తే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు.. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉందని, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందనేందుకు సూచన. ప్రమాద తీవ్రతను, ప్రజలు, అధికారులను అప్రమత్తం చేయడానికి, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి వాతావరణ శాఖ ఈ అలర్ట్ లు జారీ చేస్తుంది.