Revanth Reddy: రైతులకు ఉచిత విద్యుత్ అక్కర్లేదన్న రేవంత్ రెడ్డి.. విమర్శల వెల్లువ
- 24 గంటలు అక్కర్లేదు.. 3 గంటలు చాలని వివరణ
- తానా సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం
- మండిపడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు
- కాంగ్రెస్ పార్టీ నేతలలోనూ అసంతృప్తి
అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరుగుతున్న తానా మహాసభలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని రైతులకు ఉచిత విద్యుత్ అక్కర్లేదని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం రైతులకు కేవలం మూడు ఎకరాలు మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. ఆ మూడెకరాలను తడిపేందుకు 24 గంటల ఉచిత విద్యుత్ అక్కర్లేదని, మూడు గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తే సరిపోతుందని చెప్పారు. తాము 8 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తామని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల నుంచి వచ్చే కమీషన్ల కక్కుర్తితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉచిత విద్యుత్ నిర్ణయం తీసుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
మరోపక్క, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. అధికార పక్షం నేతలతో పాటు మంత్రులు, కార్యకర్తలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటు సొంత పార్టీ కాంగ్రెస్ లోనూ రేవంత్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా రేవంత్ వ్యాఖ్యలు పార్టీకి చేటు కలిగించేలా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. అయితే, రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారో తెలియదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.