Nara Lokesh: కావలి ప్రజలు చూపించిన ప్రేమ ఎప్పటికీ మరువలేను: నారా లోకేశ్
- నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న లోకేశ్ యువగళం
- కావలి నియోజకవర్గం కొత్తపల్లిలో పాదయాత్ర
- గ్రామస్తులతో రచ్చబండ నిర్వహించిన టీడీపీ యువనేత
- గ్రామస్తుల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చిన లోకేశ్
టీడీపీ అగ్రనేత, మాజీమంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నారా లోకేశ్ కొత్తపల్లి గ్రామంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తపల్లి గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు లోకేశ్ ను పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. అందుకాయన అందరికీ ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు.
గ్రామస్తులు ఏమన్నారంటే...
పాదయాత్ర మొదలు పెట్టిన రోజు మీ మనస్సు లో ఉన్న ఆలోచన ఏమిటి? యువతకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అని ఓ యువతి ప్రశ్నించారు. వరి రైతులు జగన్ పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం కొనుగోలు చేయడంలేదని, ఒకవేళ కొనుగోలు చేసినా. డబ్బులు ఇవ్వడం లేదని రైతులు వాపోయారు.
15 ఏళ్లుగా వచ్చే పెన్షన్ జగన్ కట్ చేశాడని ఒక వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారని, కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని కొందరు గ్రామస్తులు తెలిపారు. డ్వాక్రా యానిమేటర్లుగా పనిచేస్తున్న తాము జగన్ పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నామని కొందరు మహిళలు లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు.
యువగళం లక్ష్యం ఏంటి? టీడీపీ అధికారంలోకి వస్తే మీరు సీఎం అవుతారా అని ఓ యువకుడు లోకేశ్ ను ప్రశ్నించారు. టీడీపీ హయాంలో చదువుకునే బాలికలకు సైకిళ్లు అందించారని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆ పథకం ఆపేసిందని కొత్తపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు.
కొత్తపల్లి గ్రామస్తుల ప్రశ్నలకు లోకేశ్ స్పందన
రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న జగనోరా వైరస్ కి చంద్రబాబు గారే వ్యాక్సిన్ అని లోకేశ్ స్పష్టం చేశారు. బాబు అంటే బ్రాండ్... జగన్ అంటే జైలు అని అభివర్ణించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా కావలి ప్రజలు చూపించిన ప్రేమ ఎప్పటికీ మరవలేనని స్పష్టం చేశారు. తన పాదయాత్రలో 150వ రోజు, 2 వేల కిలోమీటర్ల మైలురాళ్లను కూడా కావలిలోనే పూర్తి చేసుకున్నానని సంతోషం వ్యక్తం చేశారు.
"లోటు బడ్జెట్ తో రాష్ట్రం విడిపోయినా ఎవరికి లోటు లేకుండా పరిపాలించింది చంద్రబాబు గారు. అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా, విదేశీ విద్య లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టీడీపీ ప్రభుత్వమే. అనేక పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మంది యువతకు టీడీపీ హయాంలో ఉద్యోగాలు కల్పించాం. ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టగానే ప్రజలు పడిపోయారు. పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు.
జగన్ పాలనలో కరెంట్ ఛార్జీలు తొమ్మిదిసార్లు, ఆర్టీసి ఛార్జీలు మూడుసార్లు, చెత్త పన్ను, ఇంటి పన్ను, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. జగన్ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కిలో టమాటాలు రూ.100, పచ్చిమిర్చి రూ.100, చిక్కుడు రూ.100కి పైనే ధర పలుకుతున్నాయి.
జగన్ పండుగ కానుకలు, విదేశీ విద్య, 27 ఎస్సీ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. బీసీలకు కుర్చీ, టేబుల్ లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పెంచిన పన్నులు అన్ని తగ్గిస్తాం. పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తాం.
జగన్ పాలనలో రైతులు అప్పులుపాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు లేని యువతకు ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి అందిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ విడుదల చేస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం.
జగన్ 6 లక్షల పెన్షన్లు రద్దు చేశాడు. గెలిచిన వెంటనే రూ.3 వేల పెన్షన్ ఇస్తానని మోసం చేశాడు. ఇప్పుడు కరెంట్ బిల్లుకి లింక్ పెట్టి పెన్షన్ కట్ చేస్తున్నాడు.
మహిళల సమస్యలు తెలుసుకున్న తర్వాత మహా శక్తి కార్యక్రమం ప్రకటించాం. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం పేరుతో చదువుకునే పిల్లల కోసం ఏడాదికి రూ.15 వేలు అందిస్తాం. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు ఇస్తాం. దీపం పథకం ద్వారా ప్రతి ఏడాది 3 సిలిండర్లు ఉచితం. ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం.
మీ సేవ, అంగన్వాడీ, డ్వాక్రా యనిమేటర్లు, గోపాల మిత్రలు ఇలా అందరినీ జగన్ వేధిస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ వేతనం పెంచుతాం. నేను రాష్ట్రం కోసం పోరాడుతున్నాను. చంద్రబాబు గారు సీఎం అయితేనే రాష్ట్రం గాడిలో పడుతుంది" అని లోకేశ్ స్పష్టం చేశారు.