Roja: అమ్మా.. నన్ను క్షమించమ్మా: పవన్ కల్యాణ్ తల్లికి రోజా క్షమాపణ
- నీ తల్లి నేర్పిన సంస్కారం ఇదేనా? అని ప్రశ్నించిన రోజా
- మీ అమ్మ గొప్పది అంటూ క్షమాపణ చెప్పిన మంత్రి
- జగన్ గొప్ప మనసుతో పవన్ బతికి బట్టకడుతున్నారని వ్యాఖ్య
- జనసేనాని ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిక
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తల్లికి మంత్రి రోజా క్షమాపణలు చెప్పారు. వాలంటీర్లపై వుమెన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేసిన పవన్‌పై మంత్రి నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ... నీ తల్లి నేర్పిన సంస్కారం ఇదేనా? అని ప్రశ్నించారు. అంతలో తిరిగి... 'నీ తల్లి చాలా గొప్పది.. అలా అనవద్దు. కానీ నీ వల్ల అందరూ ఆమెను అనే పరిస్థితి వచ్చిందని' పవన్ ను ఉద్దేశించి మండిపడ్డారు. తల్లి సరిగ్గా పెంచితే ఇలా ఎందుకు ఉంటారు? అని అందరూ అంటుంటారని గుర్తు చేశారు. కానీ నీ తల్లి గొప్పదన్నారు. నీ తల్లి నేర్పిన సంస్కారం ఇదేనా అని వ్యాఖ్యానించినందుకు 'అమ్మా.. నన్ను క్షమించమ్మా' అని రోజా క్షమాపణ కోరారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ... జగన్ ను క్రిమినల్ అని పవన్ ఆరోపించారని, కానీ రోడ్లపై గన్నులు పట్టుకొని తిరిగేవాడు క్రిమినలా? లేక ప్రజలకు సేవ చేసే ముఖ్యమంత్రి క్రిమినలా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే కొడతాం.. అంటూ క్రిమినల్ లా మాట్లాడుతున్నారని, కానీ ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నారని, ఆయన కూడా మీలా ఆలోచిస్తే పవన్ చెప్పిందే వారికి జరగాలన్నారు. కానీ ముఖ్యమంత్రి గొప్ప మనసుతో ముందుకు సాగుతున్నారని, అందుకే మీరు బతికి బట్టకడుతున్నారన్నారు. జగన్ అంటే ఓ క్రియేటర్ అన్నారు.
1972 తర్వాత ఏ నాయకుడికి సాధ్యం కాని విధంగా 51 శాతం ఓట్లతో వన్ అండ్ ఓన్లీ జగన్ వైసీపీని గెలిపించారని, ఒంటి చేత్తో 86 శాతం సీట్లు సాధించారన్నారు. మరోసారి పవన్ ఇలా మాట్లాడితే ప్రజలే ఆయనను తరిమికొట్టే రోజు వస్తుందన్నారు. కరోనా సమయంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ దొంగల్లా హైదరాబాద్ లో దాక్కుంటే, టీడీపీ కేడర్, జనసేన కేడర్ కు సేవ చేసింది ఈ వాలంటీర్లే అన్నారు.
ఇప్పుడు పవన్ సమావేశాలకు వచ్చి విజిల్స్ వేస్తున్న యువత ఇలా ఉందంటే అందుకు కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవే అన్నారు. వాలంటీర్లపై ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్లు రాలగొడతారన్నారు. 2024లోను జగనన్న వన్స్ మోర్.. బైబై బీపీ అని చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదన్నారు.