Chandrababu: పూర్ టు రిచ్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కష్టమే.. కట్టెల పొయ్యితో మా అమ్మ పడిన బాధలను చూశా: చంద్రబాబు
- పూర్ టు రిచ్ విధానం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్న చంద్రబాబు
- పేదల ఆదాయాన్ని పెంచడమే తమ లక్ష్యమని వ్యాఖ్య
- మేనిఫెస్టోలో మహాశక్తి పేరిట మహిళలకు ప్రాధాన్యతను కల్పించామన్న టీడీపీ అధినేత
మహానాడులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ప్రజలను ఆకట్టుకునేలా మినీ మేనిఫెస్టో ఉందని టీడీపీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. వీటిలో పూర్ టు రిచ్ విధానం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మరోవైపు ఈరోజు మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో చంద్రబాబు మాట్లాడుతూ... పూర్ టు రిచ్ విధానం వినూత్నమైనదని చెప్పారు. పూర్ టు రిచ్ విధానాన్ని అర్థం చేసుకోవడం కొంత కష్టమైనా... ఆచరణలో ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని అన్నారు. పేదలకు ఇప్పుడు రోజుకు రూ. 150 మాత్రమే వస్తోందని... సంపదను సృష్టించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడమే తమ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో పేదరికం ఉందన్నది ఎంత వాస్తవమో... సంపదను సృష్టించడం కూడా అంతే అవసరమని అన్నారు.
మహిళలకు ఇప్పటి వరకు నాలుగు పథకాలను మాత్రమే ప్రకటించామని... మరిన్ని ఎక్కువ కార్యక్రమాలను కూడా చేసే ఆలోచన ఉందని చంద్రబాబు చెప్పారు. ఎక్కువ కార్యక్రమాల్లో మహిళలను భాగస్వాములను చేస్తే... కుటుంబం, సమాజం రెండూ బాగుపడతాయని అన్నారు.
కట్టెల పొయ్యి మీద తన తల్లి పడిన కష్టాలను తాను చూశానని... అందుకే ఏ మహిళ కష్టపడకూడదని ఆనాడు గ్యాస్ సిలిండర్లను తీసుకొచ్చామని చంద్రబాబు చెప్పారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరతో మహిళలు మళ్లీ కట్టెల పొయ్యికి పరిమితమయ్యే పరిస్థితులు ఉన్నాయని... అందుకే ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా టీడీపీ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. మహిళా శక్తి ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతూనే వస్తోందని... అగ్రరాజ్యం అమెరికాకు కూడా ఇప్పటి వరకు మహిళ అధ్యక్షురాలిగా కాలేదని చెప్పారు. మినీ మేనిఫెస్టోలో మహాశక్తి పేరిట మహిళలకు ప్రాధాన్యతను కల్పించామని అన్నారు.