Bihar IAS: రూ.14 వేల ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేస్తే.. రూ.20 తిరిగిచ్చిన ఎయిర్ లైన్స్!
- క్యాన్సిలేషన్ చార్జీలు, కన్వీనియెన్స్ చార్జీలంటూ కోత
- బీహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారికి వింత అనుభవం
- ఏదైనా మంచి పెట్టుబడి పథకం చెప్పాలంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసిన ఐఏఎస్
అనుకోని పరిస్థితుల్లో ప్రయాణం రద్దయితే అంతకుముందు బుక్ చేసుకున్న టికెట్ ను క్యాన్సిల్ చేస్తాం.. కొంతమొత్తం చార్జీల కింద తీసేసుకున్నా మిగతా సొమ్ము తిరిగి వస్తుందని ఆశిస్తాం.. అయితే, బీహార్ కు చెందిన ఐఏఎస్ అధికారికి ఈ విషయంలో చేదు అనుభవం ఎదురైంది. టికెట్ ఖరీదులో దాదాపుగా మొత్తం సొమ్మును కట్ చేసిన ఎయిర్ లైన్స్ కంపెనీ ఓ కాఫీ కొనేందుకు సరిపడా డబ్బులను మాత్రమే తిరిగిచ్చింది.
దీంతో మండిపడ్డ ఆ అధికారి టికెట్ క్యాన్సిల్ చేస్తే ఫలానా ఎయిర్ లైన్స్ కంపెనీ తిరిగిచ్చిన డబ్బులను ఎలా ఖర్చు పెట్టాలో తెలియడంలేదు, మంచి పొదుపు పథకం ఏదైనా తెలిస్తే చెప్పండంటూ ఫొటోతో పాటు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
బీహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి రాహుల్ కుమార్ ఇటీవల ప్రయాణం రద్దు చేసుకుని ఎయిర్ టికెట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. రూ.13,820 పెట్టి కొన్న టికెట్ ను క్యాన్సిల్ చేస్తే సదరు ఎయిర్ లైన్స్ కంపెనీ తిరిగిచ్చింది కేవలం 20 రూపాయలే. ఇదేంటని వివరాలను పరిశీలించగా.. ఎయిర్ లైన్స్ కంపెనీ పంపిన చార్జీల వివరాలు ఇలా ఉన్నాయి.
- టికెట్ క్యాన్సిలేషన్ చార్జీ రూ. 11,800
- జీఐ క్యాన్సిలేషన్ చార్జీ రూ. 1,200
- కన్వీనియెన్స్ చార్జీ రూ. 800
మొత్తం క్యాన్సిలేషన్ చార్జీలు రూ.13,800.. ఈ మొత్తాన్ని మినహాయించుకున్న ఎయిర్ లైన్స్ కంపెనీ రూ.20 వాపస్ చేసింది. ఈ వివరాలకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ రాహుల్ కుమార్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.