Bengaluru: బెంగళూరులో ప్రమాదకరంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- విమానంలోని ఇద్దరు పైలట్లు సురక్షితం
- విమానం ప్రమాదకరంగా దిగిన ఫోటోలు, వీడియోలు వైరల్
బెంగళూరు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) విమానాశ్రయంలో ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. అయితే అత్యవసర ల్యాండింగ్ సమయంలో రన్ వేపై అదుపుతప్పి ప్రమాదకరంగా దిగింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్ల మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఇందులో ప్రయాణికులు ఎవరూ లేరని ఏవియేషన్ రెగ్యులేటర్ తెలిపింది.
హెచ్ఏఎల్ విమానాశ్రయం నుండి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన ప్రీమియర్ 1ఏ విమానం వీటీ-కేబీఎన్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత ముందువైపు ఉన్న నోస్ ల్యాండింగ్ గేర్ రీట్రాక్ట్ కాలేదు. దీంతో విమానాన్ని వెనక్కి రప్పించి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. హెచ్ఏఎల్ విమానాశ్రయంలో ఈ విమానం ప్రమాదకరంగా దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్ వేపై నీరు నిలిచింది. ఆ నీటిలో విమానం ముందుకు వెళ్లింది. అప్పటికే నోస్ ల్యాండింగ్ గేర్ సరిగ్గా లేకపోవడంతో ముందుకు దొర్లింది. విమానం ముందు భాగం రన్ వేను తాకి, కొంతదూరం అలాగే ముందుకు వెళ్లింది. ఎట్టకేలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీనికి సంబంధించి దర్యాఫ్తు జరుగుతోందని, అధికారిక కారణం వెల్లడి కావాల్సి ఉందని చెబుతున్నారు. గత నెలలో కర్ణాటకలోని కలబురిగి జిల్లా చిత్తాపూర్ తాలుకాలోని ఓ గ్రామంలోని వ్యవసాయ భూమిలో ఓ ప్రయివేటు ఫ్లైట్ ట్రెయినింగ్ అకాడమీ నిర్వహిస్తోన్న ట్రెయినీ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.