Ganta Srinivasa Rao: వాలంటీర్లపై వ్యాఖ్యల వివాదం.. పవన్ కల్యాణ్‌కు గంటా శ్రీనివాసరావు బాసట!
- వాలంటీర్లపై పవన్ ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదన్న గంటా
- పవన్‌కు మహిళా కమిషన్ నోటీసులివ్వడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్య
- వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడితే కమిషన్ ఎన్నడూ స్పందించలేదని విమర్శ
ఏపీ గ్రామ వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల విషయంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బాసటగా నిలిచారు. వాలంటీర్లపై పవన్ ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు, మంత్రులతో పాటు ఏకంగా ముఖ్యమంత్రే ఇష్టానుసారం మాట్లాడితే కనీసం స్పందించని మహిళా కమిషన్.. పవన్ కల్యాణ్‌కు నోటీసులు ఇవ్వడం మాత్రం విడ్డూరంగా ఉందని అన్నారు.
‘‘వ్యవస్థలో జరుగుతున్న లోపాలను పవన్ చెప్పారు. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారన్ని సంఘ విద్రోహ శక్తులు, అధికార పార్టీ నాయకులు తీసుకుని తప్పు చేస్తున్నారని చెప్పారు. అంతే తప్ప వాలంటీర్లు తప్పు చేస్తున్నారని పవన్ చెప్పలేదు” అని అన్నారు.
నారా లోకేశ్ చేపట్టిన యువగళం కార్యక్రమానికి మద్దతుగా విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెంలో టీడీపీ నేతలు చేపట్టిన ర్యాలీలో గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. యువగళం పాదయాత్ర ఎంతో విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. లోకేశ్ పాదయాత్రకు ఎన్నో అడ్డంకులు వచ్చాయని, అయినా 2,000 కిలో మీటర్ల యాత్ర పూర్తి చేయడం సాధారణ విషయం కాదని అన్నారు.