Air India: ఎయిర్ ఇండియా విమానంలో బాత్రూం తలుపు పగలగొట్టిన విదేశీయుడు
- టొరొంటో నుంచి న్యూఢిల్లీ వస్తున్న విమానంలో వెలుగు చూసిన ఘటన
- తనకు కేటాయించిన సీటులో కాకుండా మరో సీటులో కూర్చున్న నేపాలీ పౌరుడు
- బాత్రూంలో ధూమపానం, వారించిన ప్రయాణికులు, సిబ్బందితో ఘర్షణ
- విమానం ల్యాండవగానే నిందితుడి అరెస్ట్
ఎయిర్ ఇండియాలో విమానంలో ఇటీవల ఓ విదేశీయుడు నానా రభసా సృష్టించాడు. సిబ్బందితో పాటూ తోటి ప్రయాణికులతో గొడవపడ్డ అతడు చివరకు బాత్రూం తలుపును కూడా పగలగొట్టాడు. జులై 8న టొరొంటో (కెనడా) నుంచి న్యూఢిల్లీకి వస్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
క్యాబిన్ సూపర్ వైజర్ ఫిర్యాదు ప్రకారం, నేపాల్‌కు చెందిన మహేశ్ సింగ్ పండిత్ కెనడా నుంచి భారత్‌కు ఎయిర్ ఇండియా విమానంలో బయలుదేరాడు. విమానం ఎక్కిన క్షణం నుంచి అతడు అసంబద్ధంగా వ్యవహరించడం ప్రారంభించాడు. తొలుత అతడు తనకు కేటాయించిన సీటులో కాకుండా పక్కనున్న మరో సీటులో కూర్చున్నాడు. ఆ తరువాత బాత్రూంలోకి వెళ్లి ధూమపానం చేశాడు. ఆ తరువాత తలుపు పగలగొట్టాడు. అతడిని వారించబోయిన సిబ్బంది, తోటి ప్రయాణికులపై దాడికి దిగడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి.
మహేశ్ సింగ్ పండిత్ ఎంతకీ తన తీరు మార్చుకోకపోవడంతో చివరకు విమానంలోని వారందరూ కలిసి అతడిని బలవంతంగా తన సీటులో కూర్చోబెట్టారు. విమానం ల్యాండవగానే భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఘటన విషయాన్ని డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు తెలియజేశామని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.