Chinese Loan App: చైనా లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు.. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
- బెంగళూరులో ఘటన
- ఫోన్‌లోని ప్రైవేటు ఫొటోలు బయటపెడతామని వేధింపులు
- విడతల వారీగా డబ్బులు చెల్లిస్తానన్న విద్యార్థి తండ్రి
- పదేపదే ఫోన్లు చేసి బెదిరించడంతో ఆత్మహత్య
- తనకు మరో మార్గం లేకుండా పోయిందంటూ సూసైడ్ నోట్
చైనా లోన్‌యాప్ ఏజెంట్ల వేధింపులకు మరొకరు బలయ్యారు. పెరుగుతున్న వేధింపులు తట్టుకోలేక ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరులో జరిగిందీ ఘటన. 22 ఏళ్ల తేజస్ రుణాలిచ్చే చైనా యాప్ ద్వారా కొంతమొత్తం తీసుకున్నాడు. తిరిగి చెల్లించే విషయంలో విఫలం కావడంతో యాప్ ఏజెంట్లు వేధింపులకు దిగారు. డబ్బులు తిరిగి చెల్లించకుంటే బాధితుడి ఫోన్‌లో ఉన్న ప్రైవేటు ఫొటోలను బయటపెడతామని బెదిరించారు.
వేధింపులు రోజురోజుకు మితిమీరుతుండడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన తేజస్ జలహళ్లిలోని తన ఇంట్లో మంగళవారం ఉరేసుకున్నాడు. తేజస్ యలహంకలోని నిట్టె మీనాక్షి కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు.‘స్లైస్ అండ్ కిస్’ అనే చైనా యాప్ నుంచి తేజస్ కొంత మొత్తం రుణం తీసుకున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు. విషయం తెలిసిన తేజస్ తండ్రి గోపీనాథ్ ఆ డబ్బులను విడతల వారీగా చెల్లిస్తానని హామీ కూడా ఇచ్చారు.
తేజ ఆత్మహత్యకు మూడు రోజుల ముందు రుణ చెల్లింపునకు మరికొంత సమయం కావాలని ఏజెంట్లను గోపీనాథ్ అభ్యర్థించినా వారు ససేమిరా అన్నారు. వారు ఆయన ఇంటికి వెళ్లి మరీ బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం యాప్ ఏజెంట్లు తేజస్‌కు పలుమార్లు ఫోన్లు చేశారు. దీంతో తేజస్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు అతడు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనకు మరోమార్గం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని, తనను క్షమించాలని ఆ లేఖలో వేడుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.