Botsa Satyanarayana: తెలంగాణ విద్యా విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించిన బొత్స
- ట్రిపుల్ ఐటీ ప్రవేశాలను ప్రకటించిన సందర్భంగా బొత్స విమర్శలు
- తెలంగాణలో చూచిరాతలు, కుంభకోణాలను ప్రతి రోజు చూస్తున్నామని విమర్శ
- ఉపాధ్యాయుల బదిలీలను కూడా సక్రమంగా చేసుకోలేని దుస్థితిలో తెలంగాణ ఉందని ఎద్దేవా
తెలంగాణ రాష్ట్ర విద్యా విధానంపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో చూచిరాతలు, కుంభకోణాలను ప్రతి రోజు చూస్తూనే ఉన్నామని అన్నారు. విజయవాడలో ఈరోజు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలను బొత్స ప్రకటించారు. ఈ నెల 20 నుంచి 25 వరకు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యా విధానంపై ఆయన మాట్లాడుతూ... ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చి చూడాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలను కూడా సక్రమంగా చేసుకోలేని దుస్థితిలో తెలంగాణ ఉందని విమర్శించారు. మన విద్యా విధానం మనదని, మన ఆలోచనలు మనవని చెప్పారు.
వాలంటీర్లపై పవన్ చేసిన ఆరోపణల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... పొద్దున్నే పవన్ గురించి మాట్లాడుకోవడం ఎందుకని అన్నారు. పవన్ వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఉంటేనే మంచిదని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పుట్టిందనే విషయాన్ని తొలుత పవన్ తెలుసుకోవాలని సూచించారు. దుర్బుద్ధితోనే వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.