Maharashtra: 9వ తరగతి విద్యార్థిని చంపేస్తానని బెదిరించి లక్షలు గుంజిన పదో తరగతి విద్యార్థి
- మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఘటన
- ఒకే స్కూల్‌లో చదువుకుంటున్న బాలురు
- చంపేస్తానని బెదిరించడంతో రూ. 10 లక్షలు ఇచ్చేసిన బాలుడు
- లాకర్‌లో డబ్బు మాయం కావడంతో పోలీసులకు తల్లి ఫిర్యాదు
- నిందితుడితోపాటు బాలుడి బంధువు అరెస్ట్
చంపేస్తానని బెదిరించి 9వ తరగతి విద్యార్థి నుంచి లక్షలు గుంజాడో పదో తరగతి విద్యార్థి. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జరిగిందీ ఘటన. తన లాకర్ నుంచి పెద్దమొత్తంలో డబ్బులు మాయం కావడంతో అనుమానం వచ్చిన బాధిత బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఓ స్కూల్‌లో ఆమె టీచర్‌గా పనిచేస్తున్నారు. అక్కడే ఆమె కుమారుడు, నిందితుడైన బాలుడు చదువుకుంటున్నారు.
బాలురు ఇద్దరూ స్నేహితులుగా మారిన తర్వాతే ఈ ఘటన చోటుచేసుకుంది. పరిచయం బాగా పెంచుకున్న పదో తరగతి కుర్రాడు కొంత మొత్తం అప్పు అడిగాడు. అలా ఇచ్చిన రూ. 500 తిరిగి ఇవ్వకపోవడంతో మళ్లీ డబ్బులు అడిగినా ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో కక్ష పెంచుకున్న నిందితుడైన పదో తరగతి బాలుడు డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన బాధిత కుర్రాడు తల్లి లాకర్ నుంచి డబ్బులు తీసి ఇవ్వడం మొదలుపెట్టాడు. అంతేకాదు, జరిగిన విషయాన్ని బాలుడు తన బంధువైన వ్యక్తితో చెప్పగా అతడు కూడా బెదిరించి రెండు లక్షలు ఇవ్వాలని బెదిరించినట్టు పోలీసులు తెలిపారు.
ఓ రోజు బాధిత బాలుడి తల్లి తన లాకర్‌ను చెక్ చేయగా పెద్దమొత్తంలో డబ్బు మాయమైన విషయాన్ని గుర్తించారు. మొత్తం రూ. 11 లక్షలకు గాను రూ. లక్ష మాత్రమే ఉండడంతో షాకయ్యారు. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పదో తరగతి బాలుడితోపాటు రెండు లక్షలు ఇవ్వాలని బెదిరించిన బాధిత బాలుడి బంధువు ఆకాశ్ ఖేడ్‌ను కూడా అరెస్ట్ చేశారు.