Pawan Kalyan: నా ప్రాణాన్ని, కుటుంబాన్ని పణంగా పెట్టి వచ్చా: పవన్ కల్యాణ్
- పేద ప్రజల బతుకులు మార్చాలనే రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్
- రాజకీయాల్లో ఎదురు దాడి చేయడాన్ని నేర్చుకోవాలని సూచన
- పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థ ఎందుకని ప్రశ్న
రాజకీయాల్లో ఎదురుదాడి చేయడం అలవాటు చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులకు సూచించారు. మనం తప్పు చేయనప్పుడు దేనికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అద్భుతాలు చేయాలనే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి రాలేదని... పేద ప్రజల బతుకులు మార్చాలనే వచ్చానని అన్నారు. సమాజంపై ప్రేమతో తన ప్రాణాన్ని, తన కుటుంబాన్ని పణంగా పెట్టి వచ్చానని చెప్పారు.
వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను తాను కానీ, తన కుటుంబం కానీ ఎందుకు ఎదుర్కోవాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు కొత్తగా సచివాలయ వ్యవస్థ ఎందుకని నిలదీశారు. వైసీపీ నేతలు అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజల మాన ప్రాణాలకు భంగం కలిగిస్తే తన అభిమానినైనా శిక్షించాల్సిందేనని చెప్పారు.
టీడీపీకి జనసేన బీటీమ్ అనే వ్యాఖ్యలపై స్పందిస్తూ... మన పార్టీవాళ్లే తొలుత సందేహిస్తున్నారని చెప్పారు. వైసీపీ వాళ్లు ఇలాంటి ఆరోపణలు చేయడం సహజమేనని, సొంత పార్టీ వాళ్లు కూడా సందేహించడం తనకు ఇబ్బందిగా ఉందని అన్నారు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు.