Nara Lokesh: లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన వందలాది మంది మంగళగిరి వైసీపీ నేతలు, కార్యకర్తలు

Nara Lokesh welcomes Mangalagiri YSRCP leaders and workers into TDP

  • యువగళం పాదయాత్రకు నేడు, రేపు విరామం
  • కోర్టు పని మీద ఉండవల్లి వచ్చిన నారా లోకేశ్
  • ఉండవల్లికి తరలివచ్చిన మంగళగిరి వైసీపీ నేతలు, కార్యకర్తలు
  • అందరికీ పసుపు కండువాలు కప్పి ఆత్మీయ స్వాగతం పలికిన లోకేశ్

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు నేడు, రేపు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓ కోర్టు పని మీద లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. 

మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు వందల సంఖ్యలో లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. వందలాది మంది వైసీపీ వాళ్లు తమ కుటుంబాలతో కలిసి వచ్చి తెలుగుదేశం వెంటే తాముంటామంటూ నినదించారు. లోకేశ్ వారందరికీ పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆత్మీయ స్వాగతం పలికారు. నేటి నుంచి మనమంతా టీడీపీ కుటుంబసభ్యులమని, టీడీపీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా పనిచేద్దామని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారితో లోకేశ్ సెల్ఫీలు దిగారు. 

ఈ సందర్భంగా లోకేశ్ ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే దేశమంతా మంగళగిరి నియోజకవర్గం వైపు చూసేలా ప్రగతిపథంలో నడిపిస్తానని స్పష్టం చేశారు. 

గత ఎన్నికల్లో తాను స్వల్ప తేడాతో ఓడిపోయినా నాలుగేళ్లుగా నియోజకవర్గంలో ప్రజల కోసం 23 సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నానని తెలిపారు. ఆరోగ్యరథం, పెళ్లికానుక, తోపుడు బండ్లు, జలధార, కుట్టు మిషన్లు, వెల్డింగ్ మిషన్లు, పండుగ కానుకలు, చేనేతలు-స్వర్ణకారుల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన ఘనత తనదేనన్నారు. 

మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా, ఓడిపోయిన వారైనా తాను చేసినట్టు  సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు చేశారేమో కనుక్కోండని ప్రజలకి సూచించారు. మీరు రెండు సార్లు గెలిపించిన ఎమ్మెల్యే వల్ల మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? నేను చేసిన సంక్షేమంలో కనీసం 10 శాతం అయినా చేశాడా? అని లోకేశ్ ప్రశ్నించారు.

తనని గెలిపిస్తే పేదరికం లేని, ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. తాను పాదయాత్రలో వున్నా మనసంతా మంగళగిరిపైనే ఉంటుందన్నారు. ప్రతిరోజూ మంగళగిరి నియోజకవర్గం, ప్రజల బాగోగుల గురించి తెలుసుకుంటూనే ఉంటానన్నారు. ఎవరైనా కష్టంలో ఉన్నానని, సమస్య ఉందని మెసేజ్ పంపినా కూడా స్పందిస్తానని లోకేశ్ భరోసా ఇచ్చారు. 

వైసీపీ పాలనలో అభివృద్ధి లేదని, ధరలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత, మహిళలు, రైతులు, నిరుద్యోగుల కోసం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి అందరి జీవితాల్లో వెలుగులు నిండుతాయని అన్నారు. 

  • Loading...

More Telugu News