Sabitha Indra Reddy: తెలంగాణను కించపరిచారు... మీకు వేలెత్తి చూపించే స్థాయి లేదు: బొత్సకు సబిత కౌంటర్

Sabitha Indra Reddy strong counter to Botsa satyanarayana
  • తెలంగాణ విద్యావ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను బొత్స వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • రెండు రాష్ట్రాల విద్యా వ్యవస్థలపై చర్చించేందుకు సిద్ధమా? అని సవాల్
  • తొమ్మిదేళ్ల నుండి తెలంగాణలో ఏం జరుగుతోందో తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నారా?
తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స తెలంగాణను కించపరిచేలా మాట్లాడారని, తక్షణమే తన వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యా వ్యవస్థను వేలెత్తి చూపించే స్థాయి మీకు లేదని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల విద్యావ్యవస్థలపై చర్చించేందుకు సిద్ధమా? అని సవాల్ చేశారు. విద్యా వ్యవస్థలో మేం చేసింది ఏమిటి? మీరు ఉద్ధరించింది ఏమిటి? చూద్దామా? అని ప్రశ్నించారు.

తెలంగాణ విద్యార్థుల ఐఐటీ, ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థుల ఫలితాలు తమ విద్యా వ్యవస్థకు నిదర్శనం అన్నారు. ఈ ఫలితాలు వారికి కనబడటం లేదా? అని ప్రశ్నించారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థి కోసం ఏడాదికి రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నామని, మీ రాష్ట్రంలో ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పాలన్నారు. విద్యా వ్యవస్థ అంత బాగా ఉంటే ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లక్ష మంది ఎందుకు తగ్గారో చెప్పాలన్నారు. అదే సమయంలో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల్లలో రెండున్నర లక్షల మంది విద్యార్థులు పెరిగినట్లు చెప్పారు.

తెలంగాణలో గత తొమ్మిదేళ్ల నుండి ఏం జరుగుతోందో తెలుసుకోలేని దుస్థితిలో ఏపీ నాయకులు ఉన్నారని దుయ్యబట్టారు. 2015, 2018లో తెలంగాణలో ఉపాధ్యాయ బదిలీలు జరిగాయని, ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, తప్పుగా మాట్లాడవద్దని హితవు పలికారు. తాము రెండు రాష్ట్రాల్లోని ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నామన్నారు. కేసీఆర్ విజన్ తో తెలంగాణ విద్యావ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. టీఎస్‌పీఎస్సీలో జరిగిన అవకతవకలపై సిట్ తో పారదర్శకంగా విచారణ జరిపిస్తున్నామన్నారు.
Sabitha Indra Reddy
Botsa Satyanarayana
Telangana
Andhra Pradesh
education

More Telugu News