Nara Lokesh: మంగళగిరి కోర్టులో వాంగ్మూలం ఇస్తున్న నారా లోకేశ్
- దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సునీతలపై క్రిమినల్ కేసులు దాఖలు చేసిన లోకేశ్
- తనపై, తన కుటుంబ సభ్యులపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ కేసు
- ఇప్పటికే సాక్షి పత్రికపై పరువునష్టం దావా వేసిన లోకేశ్
తనపై, తన కుటుంబ సభ్యులపై అసత్యాలను ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై టీడీపీ యువనేత నారా లోకేశ్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్, ఏపీ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై ఆయన క్రిమినల్ కేసులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీరిపై ఐపీసీ 499, 500 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
తన పిన్ని కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలతో చనిపోయినప్పుడు... వైసీపీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా తనపై దుష్ప్రచారం చేశారని... తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మణిలపై పోతుల సునీత దారుణ వ్యాఖ్యలు చేశారని లోకేశ్ కేసు దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఆయన ఈరోజు మంగళగిరి అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టుకు వచ్చారు. మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని ఇస్తున్నారు.
మరోవైపు, ఇప్పటికే ఆయన సాక్షి పత్రికపై పరువునష్టం దావా వేశారు. కోర్టుకు హాజరుకావడం కోసం ఆయన తన పాదయాత్రకు రెండు రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు.